రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా..

నిజామాబాద్‌, జూలై 18: సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ, అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌ను మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చిందని ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి జ్యోతి అన్నారు. నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో బుధవారం నాడు ఎపి మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన ఎక్సైజ్‌ పాలసీని తీసుకువచ్చి మద్యం దుకాణాలను రెట్టింపు చేసిందన్నారు. ప్రభుత్వం మద్యం వల్లే నడుస్తుందని, మద్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అభివృద్ధి ఫలాలను పేద ప్రజలకు అందించలేకపోతుందన్నారు. ప్రభుత్వం మద్యాన్ని ప్రోత్సహిస్తున్నందున సిండికేట్‌లు అధికమయ్యారని, వీరిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు అధికమయ్యాయని, వీటిని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయాలని అన్నారు. రాష్ట్రంలో మహిళలు వివక్షతకు గురవుతున్నారని, వివక్షలో ఎపి పదవ స్థానంలో ఉందన్నారు. సైబర్‌ నేరాలు అధికమయ్యాయని, ప్రేమ పేరుతో అశ్లీల చిత్రాలు రాష్ట్రంలో అధికమయ్యాయన్నారు. కాలేజీలలో విద్యార్థునులపై దాడులు అధికమయ్యాయని , వీటి నియంత్రణకు చట్టం తీసుకురావాలన్నారు.దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఎపి మహిళాసమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ముడుపు నళినిరెడ్డి, కార్యదర్శి మందాస్వరూప, కె.గంగామణి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.