రూ.10 కోట్లతో టెంపుల్‌ సర్క్యూట్‌ టూరిజం

పర్యాటక కేంద్రంగా కాకినాడ
కాకినాడ, జూలై 30 : రూ.10 కోట్లతో సామర్లకోట, సర్పవరం, పిఠాపురం, ద్రాక్షారామంల మధ్య టెంపుల్‌ సర్క్యూట్‌ టూరిజం అభివృద్ధికి అవసరమైన నివేదికను కూడా ప్రభుత్వానికి పంపారు. జిల్లాలో నాలుగైదు ముఖ్యమైన పర్యాటక ప్రాంతాల అభివృద్దికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోనున్నారు.జిల్లా టూరిజం ప్రమోషన్‌ కౌన్సిల్‌ సమావేశంలో జిల్లా కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటకరంగం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయి నెల రోజుల్లోగా ఎపిట్కో లేదా మరేదైనా ఏజెన్సీ ద్వారా నాలుగైదు ముఖ్యమైన పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి సవివరమైన ప్రాజెక్టు నివేదికలు తయారు చేయించి ప్రభుత్వ ఆమోదానికి పంపుతామన్నారు. నవంబర్‌ చివరి వారంలో కాకినాడ బీచ్‌ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు వచ్చే సెప్టెంబర్‌ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా 5 రెవెన్యూడివిజన్ల పరిధిలోని వివిధ పర్యాటక ప్రాంతాలలో వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.కాకినాడలో 14 ఎకరాల విస్తీర్ణంలో బీచ్‌ రిసార్ట్స్‌ ఏర్పాటుకు, 7.5 ఎకరాల్లో శిల్పారామం ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా అవి భూపరి పాలనాశాఖ ముఖ్య కమీషనర్‌ వద్ద మంజూరుకు సిద్దంగా ఉన్నాయని తెలిపారు. రాజమండ్రిలో గోదావరి నదిలో 150 సీట్లతో కూడిన అత్యాధునిక బోటు షికారు సౌకర్యం ఏర్పాటుకు పర్యాటక శాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోనున్నారని తెలిపారు. పర్యాటక రంగాభివృద్ధిలో భాగంగా జిల్లాలో కోరింగ మడ ప్రాజెక్టును ఇకో టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే పర్యాటకశాఖకు 6.62 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు కేంద్రానికి పంపడం జరిగిందని దీనిలో 5 కోట్లను కేంద్రం భరించనుండగా మిగతా రూ.1.62 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుందన్నారు. అదే విధంగా కాకినాడ బీచ్‌ అభివృద్ధికి సంబంధించి రూ.5.5 కోట్లతో ప్రతిపాదనలు సిద్దం చేయడం జరిగిందని దీనిలో ఫుడ్‌కోర్టులు, కాటేజీలు, రెస్టారెంట్లు, ల్యాండ్‌ స్కేపింగ్‌లు వంటివి చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ అడిషనల్‌ చీఫ్‌ సునీత ఎం భగవత్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వీలుందని అందుకే ప్రభుత్వం పర్యాటక రంగాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ బి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కోరింగ ఇకో టూరిజం ప్రాజెక్టు, కాకినాడ బీచ్‌ అభివృద్ధి ప్రాజెక్టు, సామర్లకోట, పిఠాపురం, ద్రాక్షారామం, సర్పవరంల మధ్య టెంపుల్‌ సర్క్యూట్‌ టూరిజం అభివృద్ధికి అవసరమైన సుమారు 20 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు.