రూ. 53 లక్షలతో వసతిగృహాల అభివృద్ధి

సాంఘిక సంక్షేమశాఖ డీడీ అచ్యుతానందగుప్తా
శ్రీకాకుళం, జూలై 20 : జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లోని సమస్యల పరిష్కారానికి రూ. 53 లక్షల నిధులు విడుదలయ్యాయని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ అచ్యుతానందగుప్తా శుక్రవారం నాడు ఇక్కడ తెలిపారు. ఇచ్ఛాపురం మండల కేంద్రంలోని బాలికల వసతిగృహాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. గత ఏడాది 21 వసతిగృహాలను రూ. 10.35 లక్షలతో మరమ్మతులు చేయించామని, కొత్తగా వచ్చిన రూ. 53 లక్షలతో మిగిలిన పనులు చేపడుతామన్నారు. జిల్లాలోని 32 వసతిగృహాల్లో రూ. 44 లక్షలతో మరుగుదొడ్లు, స్నానపుగదులను మరమ్మతులు చేయించామని తెలిపారు. అయితే ఇక్కడ ఏళ్లతరబడి మరుగుదొడ్లు పూర్తికాకపోవడం శోచనీయమని, తక్షణమే సమస్యను పరిష్కరిస్తామన్నారు. వసతిగృహాల్లోని విద్యార్థులకు బయోమెట్రిక్‌ కార్డుల ప్రక్రియను ప్రారంభించలేదని, విద్యార్థుల పేర్లు, హాజరును ఆన్‌లైన్‌ ద్వారా కంప్యూటరీకరిస్తున్నామన్నారు. విద్యార్థుల భోజన మెనూను మార్చలేదని, మజ్జిగ బదులుగా ధాతువులున్న లడ్డు పంపిణీ చేస్తున్నామన్నారు. విద్యార్థుల ఉపకారవేతనాలకు సంబంధించి నమోదు ప్రక్రియ పూర్తయిందని, బకాయిలు సైతం విడుదలయ్యాయని, వచ్చే నెల 15వ తేదీలోగా పంపిణీ చేస్తామని తెలిపారు. విద్యార్థులందరికీ నోటు పుస్తకాలను అందించామని, ఏకరూప దుస్తులు ఇవ్వాల్సి ఉందని డీడీ అచ్యుతానందగుప్తా వివరించారు.