రెచ్చగొట్టే వ్యాఖ్యలొద్దు : కేకే

హైదరాబాద్‌, అక్టోబర్‌ 14 (జనంసాక్షి): ఇటీవల కేంద్ర మంత్రి ఆజాద్‌ చేసిన వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు దూరమయ్యే అవకాశం ఉందని రాజ్యసభ మాజీ సభ్యుడు కె. కేశవరావు అన్నారు. ఆదివారం  నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆజాద్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ సెంటిమెంట్‌ ఉండి కూడా ఆజాద్‌ అలా వ్యాఖ్యానించడం సమంజసంగా లేదన్నారు. తెలంగాణ ప్రజలను  రెచ్చగొట్టడమే ఆయన ఉద్దేశంగా కనిపిస్తోందని అనుమానాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణను ఇస్తామన్నది కాంగ్రెస్‌ పార్టీయేనన్నారు.  తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని హితవు పలికారు. తెలంగాణ తప్ప తమకు మరేదీ అక్కరలేదని తెలిపారు.  తెలంగాణ కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.