రేవంత్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

– అరెస్ట్‌ అక్రమమనడానికి తగిన కారణాలు చూపలేదు
– పిటీషన్‌ను కొట్టివేసిన హైకోర్టు
హైదరాబాద్‌, మార్చి11(జ‌నంసాక్షి) : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. రేవంత్‌ అరెస్ట్‌ పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టు తుది తీర్పును ప్రకటించింది. రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. అరెస్ట్‌ అక్రమమనడానికి తగిన కారణాలు చూపలేదని హైకోర్టు పేర్కొంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో డిసెంబర్‌ 4న కొడంగల్‌లో సీఎం కేసీఆర్‌ సభ జరగనుండగా.. డిసెంబర్‌ 3వ తేదీన రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌కు కేసీఆర్‌ను రానివ్వబోమంటూ హెచ్చరించారు. దీంతో ఆ అర్ధరాత్రి అనూహ్యంగా రేవంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు ఎలాంటి సమాచారం లేకుండా అర్ధరాత్రి రేవంత్‌ను అరెస్ట్‌ చేశారంటూ కుటుంబ సభ్యులు, అనుచరులు తీవ్రస్థాయిలో
మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ లీడర్‌ వేం నరేందర్‌ రెడ్డి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో ఎన్నికల సంఘాన్ని వివరణ కోరుతూ న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది . అంతేకాదు డీజీపీ నేరుగా హాజరుకావాలంటూ ఆదేశించింది. ఈ క్రమంలో డిసెంబర్‌ 17వ తేదీన మరోసారి దీనిపై విచారణ జరిపింది. అయితే నేర విచారణ చట్టం కింద ముందస్తుగా ఆయనను అరెస్ట్‌ చేసినట్లు వికారాబాద్‌ మాజీ ఎస్పీ అన్నపూర్ణ కోర్టుకు వివరించారు. సీఎం సభ కారణంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా తానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్‌ను కొట్టివేసింది.

తాజావార్తలు