రైతుల ఆవేదన చూస్తే కడుపుతరుక్కుపోతోంది

ఖమ్మం, నవంబర్‌ 8 : నీలం తుపాన్‌ ప్రభావంతో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని ఆవేదన చెందుతున్న  రైతన్నను చూస్తే కడుపు తరుక్కుపోతోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. గురువారంనాడు ఆమె ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఖమ్మంజిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలు, అర్బన్‌ మండలంలోని శివాయిగూడెం, కొనిజర్ల మండలంలోని పల్లిపాడు తదితర గ్రామాల్లో పర్యటించి నీలం తుపాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. విజయమ్మ వచ్చిన తర్వాత రైతులు తడిసి కుళ్లిపోయిన మిర్చి పంటను,  పాడైపోయిన పత్తిని, నీటిలో తడిసి పనిరాకుండాపోయిన వరి చేలను చూపించి విజయమ్మ వద్ద భోరున విలపించారు. పెట్టుబడులు పెట్టి అప్పుల పాలయ్యామని అన్నారు. రైతుల పరిస్థితి చూసి చలించిపోయిన విజయమ్మ కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుందన్నారు. తుపాన్‌ బీభత్సంతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు.
ఈ సమస్యలన్నింటికీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే పరిష్కారం లభిస్తుందని ఆమె చెప్పారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యే వెంకటరావు, వైఎస్‌ఆర్‌ సిపి జిల్లా కన్వీనర్‌ అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.