రైలు టాయిలెట్‌లో పైప్ నుంచి జారిపడిన శిశువు
జైపూర్ : వేగంగా కదులుతున్న ట్రైన్ టాయిలెట్‌లోనే ఓ మహిళ ప్రసవించింది. అయితే అప్పుడే పుట్టిన శిశివు టాయిలెట్ పైపు నుంచి జారి ట్రాక్ మధ్యలో పడిపోయాడు. కదులుతున్న ట్రైన్ టాయిలెట్ నుంచి జారి పడిన శిశువు ప్రాణాలతో సురక్షితంగా బయటపడటం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సంఘటన రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ నుంచి హనుమాన్‌గఢ్‌కు వెళ్తున్న స్టేషనరీ ట్రైన్‌లో చోటు చేసుకుంది. మన్ను అనే గర్భవతి తన భర్త, తల్లితో కలిసి ట్రైన్‌లో ప్రయాణిస్తున్నది. మార్గమధ్యంలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమె టాయిలెట్ కెళ్లి అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. వెంటనే సృహకోల్పోవడంతో అప్పుడే పుట్టిన శిశువు టాయిలెట్ ద్వారం నుంచి ట్రాక్ మధ్యలో పడిపోయాడు. కొద్ది సేపటికి తర్వాత మన్ను సృహకోల్పోవడాన్ని కుటుంబసభ్యులు గుర్తించారు. అప్పటికే ట్రైన్ హనుమాన్‌గఢ్‌కు 13 కిలోమీటర్లు దూరం ప్రయాణించింది. హనుమాన్‌గఢ్ జంక్షన్‌లో ఈ విషయాన్ని రైల్వే పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. ఇదిలా ఉండగా ట్రాక్ మధ్యలో పడి ఏడుస్తున్న శిశువును స్థానికుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. తల్లీబిడ్డలు క్షేమమేనని వైద్యులు పేర్కొన్నారు.