లగడపాటీ.. నీ అడ్రస్‌ ఎక్కడ ?

– పరకాల పోరుగడ్డలో అడుగుపెట్టు నీ అంతు చూస్తాం : హరీష్‌రావు

పరకాల మే, 27(జనం సాక్షి) :
పరకాల ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ నుండి ప్రచారం కొనసాగిస్తానని చెప్పిన లగడపాటి నీ అడ్రస్‌ ఎక్కడ దమ్ము, ధైర్యం ఉంటే పరకాల పోరుగడ్డలో అడుగుపెట్టు నీ అంతుచూస్తారు పరకాల ప్రజలు, అందుకే పరకాల ఉప ఎన్నికల ప్రచారం విరమించుకున్నావా? ఆనాడు జగన్‌కు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చిందా? అని సిద్ధిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు అన్నారు. పరకాలలో పత్రికా విలేకర్లతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకోసం 45 రోజులుగా పాఠశాలలు, కళాశాలలు మూసివేసి విద్యార్థులు, ఉపాధ్యాయులు రోడ్ల పైకి వచ్చి ఉద్యమించారని అందుకే ఇంటర్మీడియెట్‌లో, 10వ తరగతిలో విద్యార్థులు విద్యలో చాలా నష్టపోయేలా టీిఆర్‌ఎస్‌పార్టీ చేసిందని కొన్ని సమైక్యవాద పార్టీలు దుష్ప్రచారం చేశాయని అయినప్పటికి తెలంగాణ విద్యార్థులు రాష్ట్రంలోనే మొదటి ర్యాంకులో ఉత్తీర్ణులు అయ్యారని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఉద్యమం కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణకు రావలసిన వనరులు, ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకు చెందాలంటే ఉద్యమం చేయక తప్పదని అన్నారు. తెలంగాణ వాదులకు చిన్న విన్నపం సమైక్యాంధ్ర ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు తెలంగాణ ఓట్లను చీల్చడానికి కుట్ర పన్నుతున్నారని అన్నారు. పరకాల ఉప ఎన్నికల్లో టి.ఆర్‌.ఎస్‌.పార్టీని ఓడించాలనే కుట్రతో బిక్షపతి పేర్ల మీద 5గురు నామినేషన్లు వేశారని, 5గురు కాదు 500 మంది భిక్షపతి పేర్ల మీద నామినేషన్లు వేసినా మొలుగూరి భిక్షపతిని ఎదిరించే దమ్ము, ధైర్యం ఎవరికి లేదన్నారు. జగన్‌ టీఆర్‌ఎస్‌ను ఓడించాలనే పట్టుదలతో ఇడుపులపాయ నుండి 500 వాహనాలలో 500 మంది రౌడీలను, కోట్లాది రూపాయలతో టీఆర్‌ఎస్‌ పై యుద్ధానికి పంపించాడని అన్నారు. కొండా దంపతులు, గుండా దంపతులు ఎవరొచ్చినా కూడా టీఆర్‌ఎస్‌ విజయాన్ని ఆపలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీ నాయకులు దగ్గు విజేందర్‌రావు, పట్టణ నాయకులు బొచ్చు వినయ్‌, తెలంగాణ కుమార్‌, ఎం.డి.జాఫర్‌ రిజ్వీ, చందుపట్ల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.