లైంగిక వేధింపులపై డేగ కన్ను. – పొక్సో చట్టం అమలు.
– బాలికల రక్షణకు భరోసా.
– బెల్లంపల్లి రూరల్ సిఐ బాబురావు.
ఫోటో రైటప్: సేవ్ గర్ల్ చైల్డ్ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్న అధికారులు. బెల్లంపల్లి, సెప్టెంబర్10,(జనంసాక్షి) లైంగిక వేధింపులపై పోలీసులు డేగ కన్ను వేశారు. బాలికల రక్షణకు ప్రత్యేకంగా షీ టీంలను బృందాలను ఏర్పాటు చేశారు. ఈ షీ టీం బృందం నిరంతరం మహిళలు, బాలికలు ఎక్కువ తిరిగే ప్రదేశాల వద్ద నిఘా పెట్టి ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు. బాలికలపై లైంగిక దాడులకు పాల్పడితే నిందితులకు కఠిన శిక్షలు విధించేందుకు పొక్సో చట్టాన్ని వాడేందుకు సిద్ధమయ్యారు. పొక్సో చట్ట ప్రకారం మైనర్లపై వేధింపులకు పాల్పడిన నిందితులకు శిక్ష తప్పదు. ఈ చట్టంలో బాలికలపై అత్యాచారానికి పాల్పడినట్లయితే రూ. 5000 జరిమానాతో పాటు ఐదేళ్ల జైలు శిక్ష విధించవచ్చు. * పొక్సో చట్టం కఠినం* బాలికల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడితే పొక్సో చట్టం ద్వారా కఠిన చర్యలు తీసుకునే వీలుంది. లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తులే కాకుండా ఈ విషయాన్ని తెలిసి పోలీసులకు తెలియజేయకపోతే పొక్సో చట్టం ప్రయోగించవచ్చు. 2012 పొక్సో చట్టం కింద జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. ప్రధానంగా ప్రివెంట్ , ప్రొటెక్ట్, ప్రాసిక్యూషన్, రిపోర్ట్, రిడ్రెస్సెల్, రిహాబిలిటేషన్, సేఫ్టీ,సెక్యూరిటీ, సెల్ఫ్ ఎస్టీమ్ ను ప్రాతిపదికగా తీసుకుంటారు. ఈ విధంగా పొక్సో చట్టం అమలు కఠినతరం చేశారు. * లైంగిక నేరాలపై సీరియస్* లైంగిక నేరాలను పోలీసులు సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇటీవల మైనర్లపై లైంగిక దాడులు పెరగడంతో సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. కేంద్రం కూడా మైనర్లపై లైంగిక దాడుల నిరోధానికి ప్రత్యేకంగా పొక్సో చట్టం రూపొందించింది. పొక్సో చట్టం కిందనమోదైన కేసుల విచారణ వేగవంతం చేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. లైంగిక దాడులకు గురైన బాధితులకు భద్రత, భరోసా, ధైర్యం, ఆశాభావం కల్పించేందుకు పోలీసు శాఖ చొరవ చూపుతోంది. లైంగిక నేరాల కేసులు నమోదైన వెంటనే కేసు నమోదు చేయడంలో ఎలాంటి జాప్యం చేయకూడదు. బాధితులకు వైద్య చికిత్సతో పాటు చట్టపరమైన సహాయాన్ని అందించేందుకు పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. బాధితులకు న్యాయం చేయడమే కాకుండా నేరం చేసిన వారికి శిక్ష పడేందుకు పోలీసు శాఖ కృషి చేస్తోంది. విచారణ వేగవంతం చేయడానికి కృషి చేసిన కోర్టు కానిస్టేబుళ్లకు రివార్డులు అందిస్తూ ప్రోత్సహిస్తుంది. * ఈవ్ టీజింగ్ పై అవగాహన సదస్సులు *. మంచిర్యాల జిల్లాలో ఈవ్ టీజింగ్ పై షీ టీం ఆధ్వర్యంలో మరియు సేవ్ గర్ల్ చైల్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి బాలికల్ని, మహిళల్ని చైతన్య పరుస్తున్నారు. ఆకతాయిల నుంచి తమను తాము రక్షించుకునేందుకు శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం కరపత్రాలు, వాల్ పోస్టర్ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. అవసరం అయితే 100 కు కాల్ చేయాలని సూచిస్తున్నారు. 100 కు కాల్ చేయడం ద్వారా సమస్య తొందరగా తెలిసేలా ఉంటుందని తెలిపారు. * మహిళల రక్షణకు చర్యలు * సమాజంలో బాలికలు, మహిళలు స్వేచ్ఛగా తిరిగేందుకు పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పాఠశాలలు, పబ్లిక్ ప్లేస్ లు అనగా గ్రామ పంచాయతీ కార్యాలయాలు, ఆటో స్టాండ్ లు, బస్ స్టాండ్ లు, వివిధ ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి మహిళలకు భరోసా కల్పిస్తున్నారు. పాఠశాలలో బాలమిత్ర కమిటీలు ఏర్పాటు చేసి వారిలో ధైర్యం పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, సంతోషంగా, జీవించేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించేందుకు పోలీసు శాఖ ప్రయత్నాలు చేస్తోంది. బాలికలను లైంగికంగా వేధించే వారిపై అనాగరిక చర్యగా భావించి తీవ్రంగా అణచివేతకు రూపకల్పన చేశారు. అయితే పొక్సో చట్టంపై ప్రజలకు అవగాహన తప్పనిసరిగా ఉండాలి. * బాలికల రక్షణకు పటిష్టమైన చర్యలు * కోట బాబురావు సిఐ, బెల్లంపల్లి రూరల్.
బాలికల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం. పొక్సో చట్టం వల్ల బాలికలను, మహిళలను యువకులు లైంగిక వేధింపులకు పాల్పడటం తగ్గిపు అయ్యింది. బాలికలు స్త్రీల పట్ల ఎవరు ఇబ్బందికర చర్యలకు పాల్పడిన వారి పట్ల భారతీయ శిక్షాస్మృతి లోని చట్టాలు కఠినంగా ఉంటాయి. ఇందుకు పొక్సో చట్టం ఎంతో ఉపయోగపడుతుంది. చిన్నారులపై జరిగే నేరాల విషయంలో ఎలాంటి జాప్యం చేయకుండా కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేసి శిక్షించేలా చర్యలు చేపట్టాం.