వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

టిఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో భ్రమలు తొలగిపోయాయి: ఉత్తమ్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ఎవరెన్ని విమర్శలు చేసినా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజలు అధికార టిఆర్‌ఎస్‌ పట్ల విముఖంగా ఉన్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. అధికార పార్టీ పట్ల ప్రజలు విసుగెత్తి ఉన్నారని అన్నారు. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్‌ పార్టీకే ఓటు వేసేలా పని చేయాలని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. ఎన్‌ఎస్‌యూఐకి కూడా టికెట్లు ఇచ్చి తగిన ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లోని ప్రకాశం హాలులో జరిగిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్‌రావు ప్రమాణస్వీకారానికి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేజీ టు పీజీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ను కేసీఆర్‌ గాలికోదిలేశారని విమర్శించారు. తెరాస నిర్వహించేది ప్రగతి నివేదన సభకాదని ప్రజా ఆవేదన సభగా ఉత్తమ్‌ దుయ్యబట్టారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వరు కానీ.. రూ.300కోట్లతో టీఆర్‌ఎస్‌ సభ నిర్వహిస్తున్నారని ఆక్షేపించారు. ప్రజలను దోచిన డబ్బులతో ప్రగతినివేదన సభ నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. నాలుగేళ్లలో ఖాళీ ఉన్న ఉద్యోగాలే నింపలేకపోయారని…విద్యార్థులకు, నిరుద్యోగులకు కేసీఆర్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు ఖాయమని…వచ్చే కాంగ్రెస్‌ సర్కారులో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఈకార్యక్రమంలో రేవంత్‌రెడ్డితోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు పాల్గొన్నారు.