వట్టి మాటలు కట్టిపెట్టు..

చిత్తశుద్ధి ఉంటే నేదునూరుకు బడ్జెట్‌ కేటాయించి పనులు ప్రారంభించు ..
సీఎంకు పొన్నం హితవు
హుజూరాబాద్‌, ఆగష్టు 11, జనం సాక్షి :
సీఎం వట్టిమాటలు కట్టిపెట్టి, చిత్తశుద్ధి ఉంటే నేదునూరుకు బడ్జెట్‌ కేటాయించాలని కరీంనగర్‌ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం సహకార బ్యాంకు ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనులు ప్రారంభించకుండా గ్యాస్‌ కేటాయింపు లేదని సాకులు చెప్పడం సరికాదన్నారు. రాష్ట్రంలో 40 వేల కోట్ల రూపాయలతో 4 వేల మెగావాట్ల విద్యుత్‌ను అందించే విద్యుత్‌ అందించే ప్లాంట్లు నిర్మాణమై ఉన్నాయన్నారు. నిర్మాణమైన ప్రాజెక్టులకే గ్యాస్‌ కేటాయింపు లేదన్నారు. ఎలాంటి నిర్మాణం చేపట్టకుండా ఉన్న నేదునూరు ప్రాజెక్టుకు గ్యాస్‌ కేటాయించాలని అనడం విడ్డూరంగా ఉందన్నారు. నేదునూరు, శంకరపల్లి ప్రాజెక్టులను ప్రారంభించాకే గ్యాస్‌ కేటాయింపుల విషయం కేంద్రంతో సంప్రదింపులు జరిపి తీసుకువచ్చే బాధ్యత వహిస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ కేంద్ర మంత్రి జయపాల్‌రెడ్డిపై సీఎం, ఆయన వర్గీయులు నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. దీన్ని తెలంగాణలోని పార్లమెంట్‌ సభ్యులంందరం కలిసి హైకమాండ్‌ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. రాజకీయం చేయకుండా తెలంగాణలోని నేదునూరు ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని కోరారు. జిల్లాలోని ఆరు మండలాల్లో ముస్లిం కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి 30 లక్షల రూపాయలను ఎంపీ కోటా నుండి మంజూరు చేసినట్లు పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. సిరిసిల్ల, హుస్నాబాద్‌, హుజూరాబాద్‌, జమ్మికుంట, వేములవాడ, మానకొండూర్‌ మండలాలకు 5 లక్షల చొప్పున కేటాయించినట్లు వెల్లడించారు.