వాడిగా..వేడిగా.. పిఎపి సమావేశం

టీడీపీపై ధ్వజమెత్తిన ఆనం
హైదరాబాద్‌, ఆగస్టు 9 (జనంసాక్షి): ప్రజాపద్దుల కమిటీ సమావేశం గురువారంనాడు అసెంబ్లీలో వాడి..వేడిగా చర్చ జరిగింది. ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కేటాయిస్తున్న భూములపై ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. వేల ఎకరాలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయడంపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం టిఆర్‌ఎస్‌ శాసనసభ పక్ష నేత ఈటెల రాజేందర్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ సంస్థలా వ్యవహరిస్తోందని అన్నారు. వేల ఎకరాల ప్రభుత్వ భూములను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసినా ఏ ఒక్క ఎకరంలో కూడా పరిశ్రమ నెలకొల్పలేదని విమర్శించారు. వేల ఎకరాలను ధారాదత్తం చేస్తున్నా ఒక్క ఉద్యోగాన్ని కూడా ప్రభుత్వం కల్పించలేక పోయిందన్నారు. ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌లా పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తక్షణమే లాండ్‌ సీజింగ్‌ చట్టాన్ని తేవాలని ఆయన డిమాండు చేశారు.పరిశ్రమలను నెలకొల్పని భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండు చేశారు.
కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి మాట్లాడుతూ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సమావేశాలు జరుగుతున్న తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. పబ్లిక్‌ అకౌంట్స్‌ సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత చంద్రబాబు ఆదేశాలతో సొంత అజెండాతో పిఎసి సమావేశానికి వస్తున్నారని విమర్శించారు. ప్రైవేటు కంపెనీలను మూసివేయించాలన్న ప్రయత్నాలను వారు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ నేతలు హిందుజా కంపెనీకి కేటాయించిన భూములపై చర్చ జరగాలని వివేక్‌ అన్నారు. కాంట్రాక్టర్లు, వ్యాపారులు తెలుగుదేశం పార్టీలో కుమ్మక్కయ్యారని విమర్శించారు. పిఎసి సమావేశాలు నిష్పక్షపాతంగా జరగాలని ఆనం అన్నారు.