వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

నెల్లూరు, జూలై 10 : వికలాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని నగర ఎమ్మెల్యే శ్రీధర కృష్ణారెడ్డి మంగళవారం ఇక్కడ ప్రకటించారు. వికలాంగులకు వివిధ రకాల ఉపకరణాలను పంపిణీ చేసే క్రమంలో వారికి మూడు చక్రాల సైకిళ్లను, ఇతర పరికరాలు అందించారు. ఈ సమావేశంలో శ్రీధర కృష్ణారెడ్డి మాట్లాడుతూ వికలాంగుల్లో ఉన్న జబ్బుల స్థాయిని బట్టి 200 నుండి 500 రూపాయల వరకు పెన్షన్లను ప్రభుత్వం ఇస్తున్నదని అన్నారు. అదేవిధంగా బస్‌పాస్‌లు, ట్రైసైకిళ్లు, వికలాంగుల కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరికొందరు వికలాంగులను గుర్తించి వారికి పెన్షన్లు, మూడు చక్రాల సైకిళ్లను అందించనున్నామని ఆయన అన్నారు.