వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

వికలాంగుల సంఘాలకు రూ.600 కోట్లు
ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ.500 ఖర్చు
దేవరకద్ర సభలో సీఎం
మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి) :
వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితో వ్యవహరిస్తోందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. 40వేల వికలాంగుల గ్రూపులకు ఈ ఏడాది 600 కోట్ల ఆర్ధిక సహాయం చేయనున్నట్లు ఆయన చెప్పారు. గురువారం ఉదయం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో దేవరకద్ర జెడ్‌పి హైస్కూల్‌కు చేరుకున్నారు. ఆదివారం వరకు సీఎం జిల్లాలో ఇందిరమ్మ బాట నిర్వహించనున్నారు. అనంతరం అక్కడే వికలాంగులు, వికలాంగుల సమైక్య సభ్యులతో సీఎం ముఖాముఖిగా మాట్లాడారు. వికలాంగులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం చెప్పారు. వికలాంగులకు ప్రత్యేక అవసరాల కోసం మరో 200 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మహబూ బ్‌నగర్‌లో వికలాంగుల సమైక్య భవన నిర్మా ణానికి 50 లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు ఆయన చెప్పారు. వికలాంగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వారి సంక్షేమాన్ని విస్మరిస్తోందని కొంత మంది చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వికలాంగుల సంక్షేమానికి 212 కోట్ల నిధులు విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. మహిళా సంఘాల మాదిరిగా వికలాంగుల సంఘాలను ఏర్పాటు చేసి వారికి స్వయం ఉపాధి పథకం ద్వారా బ్యాంకుల నుంచి రుణాలు అందించే ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు. ఉద్యోగాల్లో వికలాంగులకు మూడు శాతం రిజర్వేషన్లు కల్పించామని, వికలాంగులను ఎవరైనా పెళ్ళిచేసుకుంటే వారికి ప్రభుత్వం నుంచి 50వేల ఆర్ధిక సహాయం అందజేస్తామని సీఎం కిరణ్‌ చెప్పారు. అనంతరం ఆయన ధన్వాడ మండలం, మరికెల్‌లో గొర్రెల కాపరులను కలుసుకున్నారు. వారితో మాట్లాడారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లా మహబూబ్‌నగర్‌ జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటివరకు 6,500 కోట్లు ఖర్చు పెట్టామని సీఎం గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కొత్తగా 8 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని ఆయన చెప్పారు. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు పూర్తి దశకు చేరుకున్నాయని, మిగిలిన ప్రాజెక్టులను కూడా త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. గొర్రెల కాపరులకు కూడా ప్రభుత్వం రుణాలు ఇస్తోందని ఆయన చెప్పారు. అక్కడి నుంచి సీఎం కిరణ్‌ ఆత్మకూరు గ్రామానికి వచ్చారు. మత్స్యకారులను కలుసుకున్నారు. వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా కలెక్టర్‌ గిరిజ శంకర్‌ను సీఎం ఆదేశించారు. అక్కడి నుంచి సీఎం జూరాల డ్యాం సైట్‌ వద్దకు చేరుకున్నారు. గద్వాల మండలం ప్రజలకు లబ్ది జరిగే సిపిడబ్ల్యుఎస్‌ స్కీంను ఆయన ప్రారంభించారు. అక్కడే కొంతమంది రైతులతో సీఎం ముఖాముఖిగా మాట్లాడారు. అక్కడి నుంచి జెన్‌కో గెస్ట్‌హౌజ్‌కు సీఎం బయల్దేరి వెళ్ళారు. జిల్లాలో జరిగే ఇందిరమ్మ బాటలో పాల్గొనేందుకు ప్రత్యేక హెలికాప్టర్‌లో దేవరకద్రకు చేరుకున్న సీఎంకు మంత్రులు డికె అరుణ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్ధసారథి, కలెక్టర్‌ గిరిజ శంకర్‌ ఇతర ఎమ్మెల్యేలు, పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. సీఎం పర్యటన దృష్ట్యా 43 ప్రత్యేక బస్సులు సీఎం కిరణ్‌ జిల్లా పర్యటన నేపధ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. సీఎం పర్యటించే ఆయా మార్గాల్లో మూడు రోజుల పాటు 43 సర్వీసులను నిర్వహిస్తున్నట్లు ఆర్‌.ఎం.అన్సారీ చెప్పారు. గద్వాల డిపో నుంచి 20, వనపర్తి 6, మహబూబ్‌నగర్‌ 8, నారాయణపేట డిపో నుంచి 9 బస్సులను ఆయా మార్గాల్లో నడపనున్నారు.