విజయమ్మ మాటలు వినపడడం లేదా ?

అక్రమాస్తుల కేసులో నిందితుడు జగన్‌ జైలుకెళ్లాడు. ఆయన పెట్టిన పార్టీ సారథ్య బాధ్యతలను ఇప్పుడు ఆయన తల్లి విజయమ్మ తన భుజానేసుకున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ఉప ఎన్నికలు జరుగుతున్న 18 స్థానాల్లో విజయమ్మ ప్రచారం చేస్తున్నారు. ఈ 18 స్థానాల్లో 17 సీమాంధ్రలో ఉండగా, కేవలం ఒక్క పరకాల మాత్రమే తెలంగాణలో ఉన్నదని తెలిసిందే. మొన్న శుక్రవారం ఆమె పరకాలలో ప్రచారం చేయడానికి వచ్చారు. ఆమె భర్త తెలంగాణకు చేసిన ‘మేళ్ల’ను ప్రధానంగా ప్రస్తావించారు. తెలంగాణ అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారని, సీమాంధ్రకు దీటుగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలనుకున్నారని పరకాల ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించారు. అదే విధంగా తన కొడుకు జగన్‌ ఒట్టి అమాయకుడని, అతని ఎదుగుదలను ఓర్వలేకనే కేసులు బనాయించి కాంగ్రెస్‌ ప్రభుత్వం జైలులో పెట్టిందని చెప్పుకొచ్చారు. జగన్‌ను కట్టడి చేసి ఉప ఎన్నికల్లో లాభపడాలని చూస్తున్నదని ఆరోపించారు. పనిలో పనిగా ప్రచారం చేస్తున్నది ఎలాగో తెలంగాణలోనే కదా అని ఇక్కడి ప్రజలను తృప్తి పర్చేందుకు తన కొడుకు, తమ పార్టీ అధినేత జగన్‌ ఎన్నడూ తెలంగాణకు వ్యతిరేకం కాదని, తెలంగాణ ప్రజల సెంటిమెంటును గౌరవిస్తున్నామని, వైఎస్‌ బతికుంటే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయ్యేదనీ, తాము అధికారంలోకి వస్తే అది పూర్తి చేస్తామని మైకుల్లో గొంతు చించుకుని గట్టిగానే చెప్పేశారు. విజయమ్మ చేసిన ఈ వ్యాఖ్యలపై పరకాలలో వాళ్ల వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేస్తున్న కొండా సురేఖ, ఆమె భర్త మురళీ స్పందిస్తూ ప్రజనుద్దేశించి దాదాపు ఇలా మాట్లాడారు. ‘చూశారా.. విన్నారా.. మా జగన్‌ పార్టీ తెలంగాణ సెంటిమెంట్‌ను గౌరవిస్తున్నదంట! జగన్‌ తల్లే ఈ విషయాన్ని చెప్పారుగా! ఇక మాకే గుద్దండి ఓట్లు’ అంటూ పిలుపునిచ్చారు. బాగుంది.. కొండా దంపతులు జగన్‌ పార్టీలో ఉన్నారు కాబట్టి, వాళ్లకు విజయమ్మ తెలంగాణ గురించి చెప్పిన రెండు ముక్కలే తెలంగాణ సాధన వ్యాఖ్యలుగా అనిపించొచ్చు. లేక విజయమ్మ కుటుంబం తమను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నదన్న కృతజ్ఞత ‘కొండా’ల్లో ఉండొచ్చు. కానీ, తమ అభిప్రాయాన్ని ప్రజలపై రుద్దేట్లు, తెలంగాణ భూములను దోచుకున్న, తన బిడ్డలకు కట్నంగా ఇచ్చుకున్న, ఇక్కడి ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి రైతుల కన్నీళ్లకు కారణమైన వైఎస్సార్‌ మంచోడని చెప్పడానికి తెలంగాణలో పుట్టిన బిడ్డలుగా సిగ్గుపడాలి. వైఎస్సార్‌ పాటించిన ద్వంద్వ సిద్ధాంతాన్నే విజయమ్మ కూడా పాటిస్తున్నారన్న విషయం కొండా దంపతులకు తెలియడం లేదా ? ఆమె ఇక్కడ తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తున్నామని, ‘ప్రాణహిత’ను పూర్తి చేస్తామని చెబుతున్నారు. సీమాంధ్రలో ఆమె తన ప్రచారంలో చేస్తున్న వ్యాఖ్యలకు పరకాలలో చెప్పిన మాటలకు సంబంధమే లేదు. అక్కడేమో పోతిరెడ్డిపాడు లాంటి అనేక ప్రాజెక్టులను నిర్మిస్తామంటున్నది. పోలవరాన్ని పూర్తి చేస్తామంటున్నది. ఈ మాటలు కొండా దంపతులకు వినబడడం లేదా ? పోతిరెడ్డిపాడు, పోలవరంతో తెలంగాణ ప్రజలు నష్టపోతారని తెలియదా ? విజయమ్మ సీమాంధ్రలో అక్కడి అభివృద్ధికి తోడ్పడే ప్రాజెక్టులను కడుతామంటున్నది. ఇక్కడేమో కేవలం తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తామంటున్నది. ఆ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్న తెలంగాణ ప్రజల సెంటిమెంటును, అవి కడతామంటున్న విజయమ్మ ఎలా గౌరవిస్తుంది ? ఈ విషయంపై తెలంగాణ ప్రజలకు కొండా దంపతులే వివరణ ఇవ్వాలి. లేకుంటే, యావత్‌ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వైఎస్సార్‌సీపీని వదిలి, పరకాల పోటీ నుంచి తప్పుకోవాలి.