విజయవంతంగా వూపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స

హైదరాబాద్‌: రాష్ట్ర వైద్యులు ఇప్పటివరకు గుండె, కాలేయం వంటి కీలక అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన వీరు తాజాగా వూపిరితిత్తులను సైతం విజయవంతంగా మార్చి ఒక మహిళకు కొత్త జీవితాన్నిచ్చారు. గతంలో ముంబయి, తమిళనాడుల్లో మాత్రమే రెండుసార్లు జరిగిన వూపిరితిత్తుల మార్పిడి చికిత్సల తర్వాత రాష్ట్రంలో ఈ ప్రయత్నం జరగడం ఇదే ప్రథమం, పుణెకు చెందిన 34 ఏళ్ల అర్చన అనే మహిళకు రెండు వూపిరితిత్తులూ దెబ్బతిన్నాయి. వూపిరితిత్తుల్ని మార్చితే తప్ప బతకడం కష్టమని వైద్యులు తేల్చారు. రెండు నెలల నరకయాతన తర్వాత బ్రెయిన్‌ డెడ్‌ అయిన మరో మహిళ వూపిరితిత్తులు లభించాయి. దాంతో సికింద్రాబాద్‌ యశోద వైద్యులు 14 గంటలపాటు శస్త్ర చికిత్స చేసి విజయం సాధించారు. రాష్ట్రంలో తొలిసారి గుండె మార్పిడి చికిత్స చేసిన డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే తాజాగా వూపిరితిత్తుల మార్పిడి చికిత్సనూ విజయవంతంగా చేశారు.