విద్యాసుమాలు విరబూయాలి
– ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి
– సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్,ఏప్రిల్ 20(జనంసాక్షి):భవిష్యత్ అంతా విద్య విూదే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎస్సీ, ఎస్టీ పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తామని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ పిల్లల కోసం ప్రారంభించ తలపెట్టిన 180 రెసిడెన్షియల్ స్కూళ్లు, కాలేజీల్లో మొదటి దశ విద్యా సంస్థలు వచ్చే విద్యా సంవత్సరం నుండే ప్రారంభించే అవకాశాలు పరిశీలించాలని ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలొ బుధవారం కొత్త రెసిడెన్షియల్ విద్యా సంస్థలపై సిఎం సవిూక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, సాంఘీక సంక్షేమగరుకుల విద్యాలయాల సోసైటి కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.వచ్చే విద్యా సంవత్సరం నుండే రెసిడెన్షియల్ విద్యా సంస్థలు ప్రారంభించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. కొత్త భవనాలు నిర్మించడానికి అనువైన స్థలాలు చూడాలని, రెసిడెన్షియల్ విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రదేశాలు గుర్తించాలని చెప్పారు. వెనుకబడిన ప్రాంతాల్లో, ఎస్సీ, ఎస్టీ జనాభా వున్న ప్రాంతాల్లో, గిరిజన తండాలు ఎక్కువగా వున్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్లతో సమావేశమై స్థలాలు నిర్ణయించాలని డిప్యూటి సిఎం కడియం శ్రీహరిని ఆదేశించారు. మండల కేంద్రాల్లోనే విద్యా సంస్థలు ఉండాలనే నిబంధన ఏమి లేదని, విద్యార్థులకు అనువైన స్థలం, ప్రభుత్వ భూమి ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేయాలన్నారు. మైనారిటీలకు ఇప్పటికే ప్రకటించిన 70 రెసిడెన్షియల్ విద్యా సంస్థలతో పాటు ఎస్సీలకు 130, ఎస్టీలకు 50 మొత్తం 250 రెసిడెన్షియల్ పాఠశాలలు, విద్యా సంస్థలు ప్రారంభం కావాలని, ఇవన్నీ కేజీ టు పీజీ విద్యలో భాగం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికీ రెసిడెన్షియల్ పాఠశాలలు లేని 32 నియోజకవర్గాలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు.
మెదక్ ఫారెస్ట్ కాలేజీకి 118 పోస్టులు
మెదక్ జిల్లాలో నెలకొల్పబోయే ఫారెస్ట్ కాలేజి నిర్వహణ కోసం అవసరమైన 118 పోస్టులను ముఖ్యమంత్రి మంజూరు చేశారు. ఈ విద్యా సంవత్సరం నుండే కాలేజి ప్రారంభం కావాలన్నారు. కొత్త భవనం నిర్మించే లోపు దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడవిూలో తరగతులు నిర్వహించాలన్నారు. హార్టికల్చర్ యూనివర్సిటీ, పారెస్ట్ కాలేజి భవనాల నమూనాలను ముఖ్యమంత్రికి అధికారులు చూపించారు. ఫారెస్ట్ కాలేజి డిజైన్ కు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి.. హార్టికల్చర్ యూనివర్సిటీ డిజైన్ కు కొన్ని మార్పులు సూచించారు. హైదరాబాద్ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ఉద్యానవనాల సాగు కోసం దళిత రైతులను ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి, వ్యవసాయ యూనివర్సిటీ వీసి ప్రవీణ్ రావు, హరిత హారం ఓఎస్డి ప్రియాంక తదితరులు హాజరైనవారిలో పాల్గొన్నారు.