విద్యుత్‌ కోతపై సబ్‌స్టేషన్ల ముట్టడి

కడప, జూలై 17 : రాష్ట్రంలో రైతులు, ప్రజలు తీవ్ర విద్యుత్‌ కోత సమస్యను ఎదుర్కొంటుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆరోపించారు. విద్యుత్‌ కోత సమస్యపై ఆ పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలు జరిగాయి. రైల్వేకోడూరులోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ఎమ్మెల్యే శ్రీనివాసులు, రాజంపేటలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, రాయచోటిలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద శ్రీకాంతరెడ్డి, పులివెందుల సబ్‌స్టేషన్‌ వద్ద పార్టీ నాయకులు అవినాష్‌రెడ్డి, కడపలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్ద పార్టీ జిల్లా కన్వీనర్‌ సురేష్‌బాబు ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. వ్యవసాయానికి, గృహాల అవసరాలకు విద్యుత్‌ను సరఫరా చేయాలని వారు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ కోత కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఏవిధమైన చర్యలు తీసుకోవడం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆ పార్టీ నాయకులు హెచ్చరించారు.