విద్యుత్‌ మన చేతుల్లో లేదన్న సీఎం

ప్రజల ఆందోళనపై మంత్రులతో సీఎం చర్చ
హైదరాబాద్‌ : ప్రజలకు రాత్రి వేళ కూడా విద్యుత్‌ కోతలు తప్పేట్లు లేవు. విద్యుత్‌ సరఫరా పరిస్థితి మెరుగుపడనంత వరకు చేయగలిగింది ఏమీ లేదనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యక్తం చేశారు. ‘ఇందిరమ్మ బాట’పై ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన మంత్రుల సమావేశంలో విద్యుత్‌ పరిస్థితిపై ప్రత్యేక చర్చ జరిగింది. విద్యుత్‌ కోతలతో తీవ్ర ఇక్కట్లు పడుతున్న ప్రజలు ‘ఇందిరమ్మ బాట’లో వారి దగ్గరకు వెళ్లినపుడు ఆందోళన వ్యక్తం చేసే అవకాశముందనే విషయం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. రాత్రి వేళల్లో విద్యుత్‌ కోతలు ఉండవని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కనీసం ఆ భరోసానైనా నిలబెట్టుకోవాలని మంత్రి పితాని సత్యనారాయణ, తదితరులు సీఎంకు విన్నవించారు. విద్యుత్‌ ఉత్పాదనకు అవసరమైన ‘ఇంధనం’లేని కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని, ఏమి చేయమంటారో చెప్పాలని ఆయన మంత్రులను కోరినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంధనం కొరత కారణంగా స్థాపక సామర్థ్యం ఉన్నప్పటికీ విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోలేకపోతున్నామని ఆయన తెలిపారు. జలాశయాల్లో నీరు లేని కారణంగా జల విద్యుదుత్పత్తి జరగడంలేదని తెలియజేశారు. రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్‌ పరిస్థితిని ట్రాన్స్‌కో సీఎండీ హీరాలాల్‌ సమారియా సమావేశంలో వివరించారు. డిమాండ్‌కు, సరఫరాకు మధ్య చాలా అగాథముందని, అందుకే విద్యుత్‌ కోతలను విధించాల్సి వస్తోందని ఆయన తెలిపారు. గత ఏడాది ఎంత విద్యుత్‌ కొనుగోలు చేశారు ? ప్రస్తుత సంవత్సరంలో ఎంత విద్యుత్‌ కొన్నారు.? థర్మల్‌ విద్యుత్‌ ఎంత వస్తోందనే వివరాలు తెలియజేయాలని సీఎండీని ప్రశ్నించారు. అయితే మంత్రులు అడిగిన సమగ్ర సమాచారాన్ని ఆయన వెంటనే ఇవ్వలేకపోయారు. దీంతో తరువాత అందజేయాలని సీఎం సూచించారు. సాధ్యమైనంత మేర వ్యవసాయానికి మాత్రం రోజుకు 7 గంటల విద్యుత్‌ ఇవ్వాలని ఆయన అధికారులను ఆదేశించారు. అవసరాల మేర విద్యుత్‌ ఉత్పాదన జరగకపోవడానికి దారి తీసిన కారణాలను ప్రజలకు వివరించేందుకు ప్రయత్నించాలని ఆయన మంత్రులు, అధికారులకు సూచించారు.