విద్యుత్‌ సర్‌చార్జి వసూలు నిలిపేయండి : హరీష్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 23 (జనంసాక్షి): పెంచిన విద్యుత్‌ సర్‌చార్జీలను వెంటనే నిలుపుజేయాలని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఆదివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంధన సర్‌ఛార్జి వసూలుకు సంబంధించిన ఉత్తర్వులను వెంటనే నిలుపుజేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. 2012-13 మొదటి త్రైమాసికంలో విద్యుత్‌ సర్‌చార్జి వసూలుకు ప్రభుత్వం సిద్ధపడడం సమంజసంగా లేదన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఐదుసార్లు విద్యుత్‌ ధరలు పెంచిందన్నారు. ఇప్పటికే డీజిల్‌ లీటరుకు 5 రూపాయల వంతున పెంచి, గ్యాస్‌ సిలిండర్ల సంఖ్యను పరిమితం చేసి సామాన్యుడి నడ్డి విరిచారన్నారు. విద్యుత్‌ సర్‌చార్జి వసూలుకు సిద్ధపడితే వారిపై మరింత భారం పడుతుందన్నారు. ఆర్టీసీ చార్జిల పెంపును కూడా నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఎవరు రూపాయి పెంచినా దాని భారం సామాన్యుడిపై పడుతుందన్న స్పృహ కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. గ్రామాల్లో రోజుకు రెండు మూడు గంటల పాటు కరెంటు ఉండడం లేదన్నారు. విద్యుత్‌ లేకపోవడంతో పంటలు ఎండిపోతుండడంతో తెలంగాణ ప్రాంత రైతు గుండెలు బాదుకుంటున్నారన్నారు. గ్రామాల్లో విద్యుత్‌ సక్రమంగా ఇవ్వని ప్రభుత్వం సర్‌ఛార్జి ఎలా వసూలు చేస్తుందో ప్రభుత్వం చెప్పాలని కోరారు.