విపక్షాల దుష్పచ్రారంపై కాంగ్రెస్‌ ప్రచారం

గుంటూరు,నవంబర్‌21 ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ద్రుష్పచారాన్ని ఇకపై సమర్థంగా తిప్పికొట్టాలని జిల్లా కాంగ్రెస్‌ నేతలు నిర్ణయించారు. ఇటీవల ఇక్కడ జరిగిన ఓ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఇక ముందుకు కదిలేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.  ప్రభుత్వ పథకాలను, చేస్తున్న కార్యక్రమాలను తెలియజేసేందుకు మనమూ ప్రజల్లోకి వెళ్ళాలని జిల్లా మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు అభిప్రాయం వ్యక్తంచేశారు. విపక్ష నేతలంతా పాదయాత్రలు చేస్తూ ప్రజల్లోకి వెళుతున్నందున అలాంటి కార్యక్రమమే చేపట్టాలని యోచిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ఈ బాధ్యతలను భుజాన వేసుకోవాలని పలువురు సూచించారు. పదవీ బాధ్యతల స్వీకారం సందర్భంగా ఇదే అంశం చర్చకు వచ్చింది. సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తాను జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా ఎదిగానన్నారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించటంతో జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి సేవ చేసే అదృష్టం కలిగిందన్నారు. కార్యకర్తలను, నాయకులను కలుపుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.  కొత్త పార్టీలు ద్రుష్పచారం చేస్తూ కాంగ్రెస్‌ పార్టీని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందన్నారు. కార్యకర్తలకు బాధ్యత మరింత పెరిగిందని పిలుపునిచ్చారు. స్వర్ణయుగం తెస్తామంటూ చెప్పే పార్టీలలో దళితులకు, పేదలకు స్థానం ఉండదని, అటువంటి పార్టీలను ప్రజలు దూరంగా పెట్టాలని మక్కెన అన్నారు. పార్టీ పటిష్టతకు మండల స్థాయి కార్యక్రమాలను నిర్వహిస్తానని  సూచించారు. వైఎస్‌ పథకాలు తమవని చెప్పుకుంటున్న వైఎస్‌ఆర్‌సీపీ ద్రుప్పచారాన్ని తిప్పికొట్టాలని కూడా నిర్ణయించారు.  2014లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.  ప్రభుత్వ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజలకు మరింత చేరువకావాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కోరారు. విపక్షాలు చేస్తున్న ద్రుప్పచారాలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించాలన్నారు. తాత్కాలికంగా వైఎస్‌ఆర్‌సీపీ ప్రజల్ని ప్రలోభపెట్టినా భవిష్యత్తులో ఆ పార్టీకి ప్రజల చేతుల్లో గుణపాఠం తప్పదన్నారు. లో నిస్తేజంగా ఉన్న పార్టీకి జవసత్వాలు నింపి మరింత పటిష్ట పరచాల్సి ఉందన్నారు.