విభేదాలు వీడి కార్యకర్తలతో మమేకం కండి

మంత్రి ధర్మాన ప్రసాదరావు
హైదరాబాద్‌, జూలై 25 (జనంసాక్షి) :గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని మంత్రుల కమిటీ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీకి, ప్రభుత్వానికి సిఫారసు చేసింది. బుధవారంనాడు గాంధీభవన్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలకు మంత్రుల కమిటీ తమ ప్రాధమిక నివేదికను సమర్పించింది. అనంతరం మంత్రుల కమిటీ చైర్మన్‌, మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నదని కమిటీ సూచించిందన్నారు. ప్రభుత్వం అమలు పరిచిన సంక్షేమ కార్యక్రమాలపై ఎక్కడికక్కడ సమీక్షలు నిర్వహించాలని సూచించామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రచారం కోసం కాంగ్రెస్‌ పార్టీకి ఒక ప్రత్యేకమైన చానల్‌ గాని, పత్రిక ఉండాలన్న అభిప్రాయాన్ని కమిటీ వ్యక్తం చేసిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలోను ఇందిరాగాంధీ విగ్రహాలను ఏర్పాటు చేయాలని కూడా సూచించిందన్నారు. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న యువతులకు వారి వివాహ సమయంలో తాళిబొట్టు, వస్త్రాలు అందించాలని పేర్కొందన్నారు. ప్రభుత్వానికి 34, పార్టీకి 17 అంశాలను కమిటీ సూచించిందని అన్నారు. పార్టీ బలోపేతానికి అగ్ర నేతలంతా కృషి చేయాలని కమిటీ అభిప్రాయపడిందన్నారు. తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి అగ్రనేతలంతా సమన్వయంతో, సంయమనంతో పార్టీ పురోగతికి కృషి చేయాలని కమిటీ కోరిందన్నారు. రాష్ట్రంలో బలహీన వర్గాల కోసం ప్రభుత్వం, పార్టీ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిందన్నారు. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ సీనియర్‌ నేతలు కార్యక్రమాలు రూపొందించుకోవాలని, వాటిల్లో కార్యకర్తలను భాగస్వాములను చేయాలని వెల్లడించిందన్నారు. నామినేటెడ్‌ పదవులను తక్షణమే భర్తీ చేయాలని కమిటీ సిఫారసు చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సాధ్యమైనంత త్వరలో నిర్వహించాలని కూడా పార్టీకి, ప్రభుత్వానికి కమిటీ సూచించిందని ధర్మాన అన్నారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై పార్టీ శ్రద్ధ చూపాలని అన్నారు.