విూ ప్రతిపాదన సరికాదు.. ఉపసంహరించుకోండి

– ఇప్పుడున్న సెక్రటేరియట్‌ భవనంకు మంచి వాస్తు ఉంది
– ఉన్నదాట్లోనే మార్పులు చేసుకుందాం
– ఆ డబ్బుతో ఎస్టీ, గురుకులాల వసతిగృహాలకు సొంత భవనాలు నిర్మించండి
– పంతానికి పోయి సచివాలయం నిర్మాణం అవసరం లేదు
– అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి
హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి) : తెలంగాణ అసెంబ్లీలో నాల్గవ రోజు వాడివేడిగా సాగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగింది. అసెంబ్లీ ప్రారంభమైన కొద్దిసేపటికి ప్రశ్నోత్తరాల సమయంలో సెక్రటేరియట్‌ బిల్డింగ్‌ తరలింపుపై శాసనసభలో చర్చ జరిగింది. ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి సూచించారు. సెక్రటేరియట్‌ బిల్డింగ్‌ ఇక్కడున్నప్పుడే కాంగ్రెస్‌ పార్టీ పరాజయం పాలైంది.. కేసీఆర్‌ కూడా సీఎం అయ్యారని ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి గుర్తు చేశారు. సెక్రటేరియట్‌ భవనం ఉన్నది చాలా మంచి వాస్తు అని చెప్పుకొచ్చారు. ఆంధప్రదేశ్‌ వాళ్లంతా ఇప్పటికే వెళ్లిపోయారని, ఆ బిల్డింగ్‌లన్నీ మనకే వస్తాయిన్నారు. ఇంకా హైదరాబాద్‌లో ఉన్న డైరక్టరేట్స్‌, కార్పొరేషన్‌ అన్నీ ఇక్కడికే తెచ్చుకోవచ్చని సర్కార్‌కు ఆయన సూచించారు. ఉన్న దాంట్లోనే మార్పులు, చేర్పులు చేసుకుంటే మంచిదని కిషన్‌రెడ్డి హితవు పలికారు. మరీ ముఖ్యంగా 500పై చిలుకు ఎస్సీ వెల్ఫేర్‌ హాస్టల్స్‌, గురుకులాలు చాలా వరకు అద్దె భవనాల్లో ఉన్నాయన్నారు. ముందుగా వాటికి ప్రాధాన్యత ఇద్దాం ఆ తర్వాత ఉన్నటువంటి సెక్రటేరియట్‌ను బాగు చేసుకుందామని కిషన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.  కొత్తగా పంతానికిపోయి కొత్త సచివాలయం నిర్మించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్కింగ్‌, పాత భవనాలు రీమోడలింగ్‌ లాంటివి కావాలంటే చేసుకోవచ్చు కాబట్టి దయచేసి సెక్రటేరియట్‌ బిల్డింగ్‌ తరలింపును ఉపసంహరించుకోవాలని స్పీకర్‌ ద్వారా సర్కార్‌ను కిషన్‌ రెడ్డి కోరారు. తెలంగాణ చరిత్రలో సెక్రటేరియట్‌కు కూడా ప్రాధాన్యత ఉందని, దానిని దృష్టిలో ఉంచుకొని తరలించాలనుకోవడం మంచి నిర్ణయం కాదన్నారు.
అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల వాకౌట్‌
సచివాలయం తరలింపు సరికాదని ఆ ప్రతిపాదనను సర్కార్‌ వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. అయితే ఇందుకు సీఎం కేసీఆర్‌ ససేమినడంతో..  ఇప్పుడున్న సెక్రటేరియట్‌ స్థలంలో కొత్త సెక్రటేరియట్‌ను అన్ని హంగులతో అద్భుతంగా కట్టొచ్చని కిషన్‌ రెడ్డి సూచించారు. ఇక్కడ్నుంచి సెక్రటేరియట్‌ను డివైడ్‌ చేస్తే హైదరాబాద్‌తో పాటు నగరవాసుల సెంటిమెంట్‌ దెబ్బతింటుందని ఆయన చెప్పుకొచ్చారు. అయినా కేసీఆర్‌ కొత్త సచివాలయాన్ని కట్టితీరుతామని తేల్చిచెప్పడంతో ప్రభుత్వ మొండి వైఖరి, ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా సెక్రటేరియట్‌ కట్టాలనుకుంటున్న సర్కార్‌కు తీరుకు నిరసనగా ప్రజల పక్షాన భారతీయ జనతపార్టీ వాకౌట్‌ చేస్తోందని ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి తెలిపారు.
కేసీఆర్‌ కుమారుడు సీఎం కాలేరన్న వాస్తుతో – సండ్ర
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ కుమారుడు కేటీఆర్‌ సీఎం కాలేరన్న వాస్తు నమ్మకంతోనే ఆయన కొత్త సచివాలయాన్ని నిర్మించాలనుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో సచివాలయం మార్పు అంశంపై మాట్లాడిన సండ్ర  కొత్త
సచివాలయంపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని సూచించారు. అసెంబ్లీలో కేసీఆర్‌ నియంతలా మాట్లాడుతున్నారంటూ సండ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సభలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు కనీసం నిరసన తెలిపే అవకాశం కూడా ఇవ్వడం లేదంటూ సండ్ర ఆవేదన వ్యక్తం చేశారు.