వెనుకబడిన తరగతుల సంక్షేమానికి వెయ్యి కోట్లు

ముఖ్యమంత్రి కిరణ్‌
హెదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 (జనంసాక్షి):
రాష్ట్రప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల బడ్జెట్‌ గత ఏడాదికంటే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో దాదాపు 60 శాతం ఎక్కువగా వెయ్యి కోట్లు అదనంగా పెంపుదల చేశామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. వివిధ బిసి సమాఖ్యలకు కూడా బడ్జెట్‌ 1600 శాతం వరకు పెంచడం జరిగిందని, అయితే గీత కార్మికుల సహకార సమాఖ్యకు రెవిన్యూ ఆర్జించే సమాఖ్య అయినందున సాంకేతిక అడ్డంకి కారణంగా బడ్జెట్‌ పెంచలేదని, బిసి మంత్రులు, ఇతర నాయకులతో చర్చించి, జనాభా ప్రాతిపదికపై కోరుతున్న రూ.50 కోట్లకంటే అవసరమైతే
ఎక్కువ కూడా మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని సీఎం హావిూ ఇచ్చారు. ప్రమాదంలో మృతిచెందిన గీతకార్మికులకు ఎన్నో ఏళ్ళుగా పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా రూ.8.5 కోట్లు ముఖ్యమంత్రి విడుదల చేసినందుకుగాను రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాది మంది గీతకార్మికులు సోమవారం క్యాంప్‌ కార్యాలయానికి చేరుకుని ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ కులవృత్తుల ఆధునీకరణ ద్వారా వారి ఉపాధిని కొనసాగిస్తూనే అదనపు ఆదాయం చేకూరే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశమై ఆయా శాఖల మంత్రులు, నాయకులతో సవిూక్ష నిర్వహించి ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి హావిూ ఇచ్చారు. జంటనగరాల 50 కిలోవిూటర్ల పరిమితిలో కల్లు విక్రయాల అంశమై ఆబ్కారీ శాఖతో చర్చించి తగు నిర్ణయం తీసుకోగలమని సీఎం తెలిపారు. సమస్యల పరిష్కారానికి రెండు, మూడు వారాల్లో పరిశీలన జరిపి అందరికీ ప్రయోజనం చేకూరే విధంగా చర్యలుంటాయని ముఖ్యమంత్రి వివరించారు. లైసెన్సుల రెన్యువల్‌ విషయంలో వెంటనే ఆ శాఖతో సవిూక్ష జరుపుతామని ముఖ్యమంత్రి హావిూ ఇచ్చారు. గీతకార్మికుల భద్రతకు ప్రభుత్వపరంగా అన్ని చర్యలూ తీసుకుంటామని, అనేక సంత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియా రూ.8.5 కోట్లు విడుదల చేశామని, అదేమాదిరి 2007 నుంచి పరిష్కారం కాకుండా ఉన్న ఆపద్భందు కేసులను కూడా తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరించడం జరిగిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యానారాయణ మాట్లాడుతూ గీతకార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని తెలియజేశారు. పార్లమెంట్‌ సభ్యులు మధుయాష్కీ గౌడ్‌ మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. గీతకార్మికులకు సంబంధించిన పలు సమస్యలను ఆయన ప్రస్తావించారు. శాసనసభ్యులు బిక్షపతి గౌడ్‌, మహేష్‌గౌడ్‌, బండి లక్ష్మాగౌడ్‌, ఏపి సంఘంచైర్మన్‌ పల్లె లక్ష్మణరావు గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.