వొడితల ప్రణవ్ బాబు నామినేషన్ దాఖలు

హుజూరాబాద్ : కాంగ్రెస్ హుజూరాబాద్ అభ్యర్థి వొడితల ప్రణవ్ బాబుకు ఆశీర్వచనాలు వెల్లువెత్తాయి. తనుగుల ఆడపడుచులు ప్రణవ్ బాబుకు హారతులు పట్టి.. ఈ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలని ఆశీర్వదించారు. అనంతరం అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీతో హుజూరాబాద్ వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ప్రణవ్ బాబు నాయకత్వం వర్ధిల్లాలి.. యువనేత గెలుపుతో భవితకు బంగారు బాట అంటూ నినాదాలతో హోరెత్తింది. స్థానికులు స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రణవ్ కు శుభాశీస్సులు తెలియజేశారు. యువనేత విజయం సాధించి చరిత్ర సృష్టించడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, సీనియర్ పాత్రికేయులు డాక్టర్ తనుగుల జితేందర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా నడుస్తోందని, ప్రణవ్ గెలుపు నల్లేరు మీద నడకేనని చెప్పారు. మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వర్ రావు కుటుంబం నుంచి ప్రణవ్ ఒక్కరే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. ప్రజల ఆదరణ ఇప్పటికే తెలిసిపోతోందని, ప్రణవ్ రికార్డు విజయం సాధిస్తారని స్పష్టం చేశారు.