శరవేగంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం
మంత్రులు, ఎమ్మెల్యేల చొరవతో కదలిక
పలుచోట్ల స్థల సమస్యతో నిర్మాణాల్లో ఆలస్యం
హైదరాబాద్,మే14(జనం సాక్షి): ఇళ్లులేని నిరుపేద కుటుంబాలకు అండగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం మేరకు అన్ని జిల్లాల్లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు శంకుస్థాపనలు జరిగాయి. ఆయా నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి.
రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్ల సదస్సులో కూడా సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అన్ని మండలాల్లో గ్రామాల్లోనూ స్థలాలను గుర్తించి, అనువుగా ఉన్నచోట్ల నిర్మాణాలు మొదలు పెట్టారు. కొన్ని ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు స్థలాల గుర్తింపు దిశగా కసరత్తు చేస్తున్నారు. కలెక్టర్ల విూదనే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల బాధ్యతలను మోపారు. దీంతో అధికారులు నిర్మాణాలకు పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించారు. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న టెండర్లకు కూడా గుత్తేదారుల నుంచి స్పందన కనిపిస్తోంది. చురుకుగా ఉన్న ఎమ్‌ఎల్యేలు, మంత్రులు,నేతలు తమ ప్రాంతాల్లో వ్యక్తిగత పర్యవేక్షనతో వీటిని పరుగెత్తిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా
వేలాది మంది రెండు పడకగదుల ఇళ్ల కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు సమర్పించారు. తాజాగా కొద్ది రోజులుగా ఈ పథకం అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. దాదాపు రెండేళ్ల కిందటే ఈ పథకాన్ని ప్రారంభించగా కొన్ని ప్రాంతాల్లో స్థలాలను సైతం గుర్తించారు. నియోజకవర్గాల్లో రెవెన్యూ అధికారులు స్థలాలను గుర్తించి గృహనిర్మాణ శాఖ అధికారులకు అప్పగించారు. అయితే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ అంచనా ప్రకారం వెచ్చిస్తున్న రూ.5.15లక్షలు సరిపోవని, పన్నుల కోతతో పాటు ఇసుక లభ్యత కష్టంగా ఉండడంతో గుత్తేదారులు ముందుకు రాలేదు. తాజాగా ఈ పథకంలో గుత్తేదారులకు ఇసుక తరలింపులో రాయితీపాటు సిమెంటులోనూ రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుండడంతో గుత్తేదారులు నిర్మాణాలకు ముందుకు వస్తున్నారు. ఇకపోతే అన్ని గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలనే గుర్తించి పథకానికి అప్పగించాలని ప్రభుత్వం నుంచి రెవెన్యూ అధికారులకు ఆదేశాలు వచ్చాయి. గతంలో నియోజకవర్గానికి కేవలం 400 ఇళ్లు మాత్రమే నిర్మించాలని నిర్లయించగా, తాజాగా మరో 1000 ఇళ్లు అదనంగా మంజూరు చేస్తున్నట్లుగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ప్రతి పంచాయతీలో స్థలాలను గుర్తించి నియోజకవర్గంలో 1400 ఇళ్ల
నిర్మాణాలను చేపట్టేందుకు యంత్రాంగం కసరత్లు చేస్తోంది. అయితే చాలా గ్రామాల్లో స్థలాల కొరత కనిపిస్తోంది. పథకంలో లబ్దిదారుల ఎంపిక పక్రియను ఎలాంటి సిఫారసులు లేకుండా కేవలం గ్రామసభల ద్వారా లబ్దిదారుల ఎంపిక చేపట్టాలని ఇప్పటికే ముఖ్యమంత్రి సూచించారు. పథకంలో తలదూర్చవద్దంటూ
నాయకులు, ప్రజాప్రతినిధులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. పథకం ప్రారంభమైన మొదట్లో గతేడాది లబ్దిదారుల ఎంపికకు అధికారులు కసరత్తు చేయగా, వెంటనే పథకాన్ని నిలిపివేసి పూర్తి విధివిధానాలతో ఇపుడు అమలు చేస్తున్నారు. గృహ నిర్మాణాలు పూర్తి అయిన తరువాతనే పారదర్శకంగా లబ్దిదారులను గ్రామస్థుల సమక్షంలో ఎంపిక చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాల్లో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయడానికి కలెక్టర్లు,మంత్రుల సూచనలతో ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా గుత్తేదారులకు పలుమార్లు అవగాహన సదస్సులు నిర్వహించారు. బిల్లుల చెల్లింపులను 24 గంటల్లో చేస్తామని, నిధుల కొరత లేదని, ఇంజనీరింగ్ అధికారుల జాప్యం లేకుండా పారదర్శకంగా బిల్లుల చెల్లింపులు చేస్తామని గుత్తేదారులకు భరోసా కలిగించారు. కలెక్టరేట్లలో ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసి రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు.సిద్ధిపేట జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయి. మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిజామాబాద్‌లో గుత్తేదారులకు మరోమారు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పరంగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు చేపట్టే గుత్తేదారులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి గుత్తేదారులకు భరోసా కల్పించారు. అయితే రెండు పడక గదుల ఇళ్ల పథకానికి కొన్ని జిల్లాల్లో ఒడిదొడుకులు ఎదురవుతున్నాయి. గ్రామాల ఎంపిక, స్థలాల గుర్తింపు మొదలుకొని టెండర్ల వరకు అన్ని స్థాయిలోనూ ఆటంకాలు ఉన్నాయి. గిట్టుబాటు కాదనే సాకుతో గుత్తేదారులు రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల పట్ల గుత్తేదారులు ఆసక్తి కనబరచక పోవడంతో ఈ పథకం కొన్నిచోట్ల ముందుకు కదలడం లేదు.