శరవేగంగా యాదాద్రి విస్తరణ పనులు

దసరా నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు
యాడా ప్రత్యేకాధికారి కిషన్‌ రావు
యాదాద్రి భువనగిరి,మార్చి19(జ‌నంసాక్షి): యాదాద్రి విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయని యాడా ప్రత్యేకాధికారి కిషన్‌ రావు అన్నారు. ఆలస్యం అయినా పనులు పక్కాగా సాగుతున్నాయని అన్నారు. దీని నిర్మాణం పూర్తయితే ఇది ప్రపంచంలోనే అద్భుత ఆలయంగా నిలిచిపోతుందని అన్నారు. సిఎం కెసిఆర్‌ ఆదేశాల మేరకు చినజీయర్‌ స్వామి సూచనల మేరకు నిర్మాణ పనులు సాగుతున్నాయని అన్నారు. యాదాద్రిని దివ్యమనోహర క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు మార్గం సుగమం చేశారు. యాదగిరిగుట్టను మరో తిరుమలగా మారుస్తానని చెప్పింది మొదలు ఇప్పటికే పదిసార్లు యాదాద్రిని సందర్శించి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు.  యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దివ్యమనోహరంగా తీర్చిదిద్దాలన్న సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష మేరకు ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో భారీ పద్దును కేటాయించారు. దీంతో ఇక యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగిరం కానున్నాయి. దేశంలోనే అద్భుత ఆలయంగా తీర్చిదిద్దడానికి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు ఈ ఏడాది దసరా వరకు పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రతి ఏటా బడ్జెట్‌లో రూ. 100 కోట్లు కేటాయింపులు చేస్తూ కొనసాగుతున్న ఆలయ అభివృద్ధి ప్రాజెక్టు పూర్తి చేయడానికి  బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో ఏమాత్రం జాప్యం లేకుండా సమాంతరంగా చేపట్టాల్సిన పనులు పూర్తి చేస్తేనే ప్రధాన ఆలయం పనులతో పాటు కొండపై భక్తులకు కనీస సదుపాయాలు సమకూరుతాయని భావిస్తున్నారు.  ఇవికాకుండా మిషన్‌ కాకతీయ ద్వారా యాదాద్రి చుట్టుపక్కల చెరువులను అభివృద్ధి చేశారు. మిషన్‌ భగీరథతో యాదాద్రికి మంచినీటి సౌకర్యం కల్పించే పనులు చేపట్టారు. గండిచెరువులో ఎప్పుడూ నీళ్లు ఉండేవిధంగా ఏర్పాటు చేశారు. గండిచెరువు గోదావరి జలాలతో కళ..కళలాడుతున్నది. ఇప్పటికే రాయగిరి నుంచి యాదగిరిగుట్ట రూ. 100 కోట్లతో రోడ్లు భవనాల శాఖతో చేపట్టిన పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి.

తాజావార్తలు