వలపు వలలో చిక్కి..

` పాక్‌కు రహస్య సమాచారం లీక్‌!
` అంబాలాకు చెందిన సునీల్‌ అరెస్టు
న్యూఢల్లీి(జనంసాక్షి):వలపు వల లో చిక్కి భారత్‌కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన అంబాలాలో చోటుచేసుకుంది. నిందితుడిని హరియాణాలోని అంబాలాకు చెందిన 31 ఏళ్ల సునీల్‌గా గుర్తించారు. పాక్‌ మహిళ వలపు వలలో చిక్కుకుని అతడు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.పాక్‌ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐకు చెందిన హ్యాండ్లర్లు ఓ మహిళ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా సునీల్‌ను పరిచయం చేసుకున్నారు. వారితో చాటింగ్‌ చేసిన నిందితుడు.. భారత్‌కు చెందిన సైనిక, వాయుసేనల కీలక సమాచారాన్ని పాక్‌కు చేరవేసినట్లు అంబాలా పోలీసులు వెల్లడిరచారు. ఓ ప్రైవేట్‌ కాంట్రాక్టర్‌ వద్ద సూపర్‌వైజర్‌గా పనిచేస్తోన్న సునీల్‌ పలు మిలిటరీ యూనిట్స్‌కు సంబంధించిన ప్రాజెక్టుల నిర్మాణంలో భాగమయ్యాడు. దీంతో ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ లోపలికి సులువుగా వెళ్లగలిగాడని, అక్కడి నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి పాక్‌కు చేరవేసినట్లు పోలీసులు తెలిపారు.ఇటీవల సునీల్‌ కదలికలపై అనుమానం రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పాక్‌ హ్యాండర్లతో జరిపిన వాట్సాప్‌ చాట్‌లను, ఫోన్‌ రికార్డ్‌లను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నారు. తనకు చెందిన కొన్ని అనుమానిత బ్యాంక్‌ ఆర్థిక లావాదేవీలనూ పరిశీలిస్తున్నారు. భారత్‌కు చెందిన రహస్య సమాచారం తెలుసుకునేందుకు సునీల్‌కు ఐఎస్‌ఐ డబ్బును ఎరగా వేసినట్లు డీఎస్పీ వెల్లడిరచారు. అయితే, ఈ వ్యవహారంలో ఇంకెవరి ప్రమేయం ఉందేమోననే కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని నాలుగు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నామన్నారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.