నిన్న ప్రియురాలు, నేడు ప్రియుడు బలవన్మరణం

 

 

 

 

 

 

జనవరి 07 (జనంసాక్షి):వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు జీవితాంతం కలిసి జీవించాలని కలలు కన్నారు. అందుకు పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఒకరు లేకుండా మరొకరు ఉండలేక చావే శరణ్యమని భావించారు. ఉరేసుకొని నిన్న ప్రియురాలు పెట్రోల్ పోసుకొని నేడు ప్రియుడు ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. క్షణికావేశంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం రేపింది. దీనికి సంబంధించి సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

కలువకుండా చేయడం వల్లే..

రంగారెడ్డ జిల్లా యాచారంమండల పరిధిలోని మేడిపల్లి గ్రామంలో పోతురాజు అలివేలు కూతురు పోతురాజు పూజ (16)అనే విద్యార్థిని ఇబ్రహీంపట్నంలోని కార్తికేయ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. పూజా తండ్రి పదహారేళ్ల క్రితం మృతి చెందడంతో అప్పటినుంచి తన తల్లి అలివేలు కుమారుడు కుమార్తె ఇరువురిని పెంచి పోషించింది. అదే గ్రామానికి చెందిన సిద్ధగోని యాదయ్య కుమారుడు సిద్ధగోని మహేష్ (20) గత నాలుగు ఐదు నెలలుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. విషయం ఇరు కుటుంబాల్లో తెలవడంతో వీరిని గత కొన్ని రోజులుగా కలుసుకోకుండా చేశారు.

దీంతో ఇటీవలే మహేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కొన్ని రోజులు దవాఖానాలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు. మహేష్ పురుగుల మందు తాగిన విషయాన్ని తెలుసుకున్న పూజ సైతం మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. ఆమె సైతం ప్రాణాలతో బయటపడింది. ఇదిలా ఉంటే గత సోమవారం మహేష్ మళ్లీ పూజ తాత నారయ్య ఫోన్ కు ఫోన్ చేసి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకో లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పడంతో ఈ విషయాన్ని పూజ తన తల్లి అలివేలుతో చెప్పింది.

ప్రియురాలు మృతి తట్టుకోలేక..

మహేష్ ఫోన్ చేసినప్పటి నుంచి పూజ మానసిక ఒత్తిడికి గురైంది. తన ప్రియుడు ఆత్మహత్య చేసుకుంటాడేమోనని దిగులుతో తానే మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉదయం ఎనిమిది గంటలకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పూజ మృతి చెందడంతో గ్రామంలో కొద్దిసేపు ఆందోళన నెలకొంది. పోలీసుల రంగప్రవేశంతో పూజ మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం మార్చురూకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. సాయంత్రం మృతదేహాన్ని తీసుకొచ్చి పూడ్చిపెట్టారు.

పూజ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న అన్న విషయాన్ని తెలుసుకున్న మహేష్ బుధవారం హయత్ నగర్ పరిధిలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అటు పూజ ఇటు మహేష్ ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో మేడిపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇరు కుటుంబాలలో రోదనలు మిన్నంటాయి. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.