కొవ్వూరులో ట్రావెల్స్ బస్సు దగ్ధం

 

 

 

 

 

 

జనవరి 6 ( జనం సాక్షి)ఓ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు డ్రైవర్ అప్రమత్తతో అందులోని ప్రయాణికులను సురక్షితంగా బయటపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ట్రావెల్స్ బస్సు కొవ్వూరు ఫ్లైఓవర్‌ పైకి వచ్చేసరికి సెల్ఫ్ మోటార్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు నిలిపివేశారు. వెంటనే ప్రయాణికులకు సమాచారం అందించారు. దీంతో బస్సులోని ఆరుగురు ప్రయాణికులు, నలుగురు సిబ్బంది బయటకు వచ్చేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారు.

ఘటనాస్థలికి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కానీ అప్పటికే బస్సు చాలావరకు దగ్ధమైంది. 80లక్షల మేర నష్టం జరిగిందని అంచనా. కాగా, ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు తరలించారు.