శిరీషను హత్య చేసింది బాయ్‌ఫ్రెండే
హైదరాబాద్,మే11(జనం సాక్షి ): నగర శివారులోని ప్రగతి రిసార్ట్స్ లో డిగ్రీ విద్యార్థిని శిరీషను ఆమె స్నేహితుడు సాయిప్రసాద్ అతి కిరాతకంగా గొంతుకోసి హత్య చేసాడని గుర్తించారు. గత ఆరు సంవత్సరాలుగా తనతో కలిసి తిరుగుతూ, ఇప్పడు వేరే యువకుడితో చనువుగా ఉంటుందనే శిరీషను హతమార్చానని సాయిప్రసాద్ అంగీకరించినట్టు సమాచారం. గురువారం మధ్యాహ్నం పక్కా ప్లాన్ ప్రకారం శిరీషను నగర శివారులోని ప్రగతి రిసార్ట్స్ కు తీసుకెళ్లిన సాయి ఆమెతో పెళ్లి విషయమై వాగ్వాదానికి దిగాడు. తనను పెళ్లి చేసుకోవాలని శిరీషను కోరాడు. కానీ దానికి ఆమె అంగీకరించలేదు. దాంతో కోపోద్రిక్తుడైన సాయిప్రసాద్ తనతో పాటు తీసుకెళ్లిన పదునైన కత్తితో గొంతుతో పాటు ఛాతీపై పొడిచి హత్య చేశాడు. తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే గంటల వ్యవధిలోనే సాయిప్రసాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం అతన్ని చేవెళ్ల పోలీస్ స్టేషన్‌లో విచారిస్తున్నారు. కాగా, శిరీషపై తాను అత్యాచారం చేయలేదని, తనను పెళ్లి చేసుకోవాలని వేడుకున్నానని, కానీ ఆమె అంగీకరించకపోవడంతోనే హత్య చేసినట్టు పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.
—-