శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

తిరుపతి, మే 27 (జనంసాక్షి): శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం దేశం నలుమూలల నుంచి వేలాది మంది తిరుమల కొండకు చేరుకుంటుండడంతో స్వామి దర్శనానికి సుమారు 24 గంటలకు పైగా పడుతోంది. భక్తులతో 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోవడమేకాక బయట సుమారు రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్‌ ఉంది. అదే సమయంలో 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి, కాలిబాటన తిరుమలకు చేరుకునే భక్తులకు స్వామి దర్శనం సుమారు 11 గంటల సమయం పడుతోంది. శనివారం జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులకు గాయాలైన విషయం విదితమే. అదే విధంగా శనివారం వేకువజామున సుభ్రపాత సేవ నుంచి అర్ధరాత్రి నిర్వహించే ఏకాంత సేవ సమయం వరకు సుమారు లక్షా కుపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. వేసవి సెలవులు ముగిసే వరకు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్టు ఆలయ ఉన్నతాధికారులు తెలిపారు.