శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవములు
– ఈనెల 26 నుండి అక్టోబర్ 6 వరకు
– భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు
– ఉత్సవాల బ్రోచర్స్ ఆవిష్కరించిన పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 23(జనం సాక్షి)
చారిత్రక వరంగల్ నగరంలోని శ్రీ భద్రకాళి దేవాలయంలో శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్ర మహోత్సవములు ఈనెల 26 నుంచి అక్టోబర్ 6 వరకు జరగనున్నాయి. ఈ మేరకు శుక్రవారం దేవాలయ ప్రాంగణంలో ఉత్సవాల ఏర్పాట్లు సౌకర్యాలపై ఆలయ ఈవో శేషు భారతి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వినయ్ భస్కర్, భద్రకాళి ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు, కూడా చైర్మన్ సుందర్ రాజన్ యాదవ్, ఆలయ సూపరింటెండెంట్ విజయ్, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి తోపాటు స్థానిక కార్పొరేటర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినయ భాస్కర్ మాట్లాడుతూ ఉత్సవాలను గతం కంటే మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఆలయ ప్రాంగణంలో మినరల్ వాటర్ సౌకర్యం కలిగించినట్లు తెలిపారు. అదేవిధంగా నవరాత్రుల సందర్భంగా పారిశుద్ధ్యము నిర్వహణ చక్కగా నిర్వహించేలా 20 మంది పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్స్ ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఆలయ ఈవో శేషు భారతి మాట్లాడుతూ ఆలయంలో సీసీ కెమెరాలు, ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ అలంకరణ, చలువ పందిళ్లు ,క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ప్రసాద వితరణ భద్రకాళి సేవ సమితి తరపున భక్తులందరికీ జరిగేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. అలాగే వచ్చే నెల 5న విజయదశమి సందర్భంగా అమ్మవారి తెప్పోత్సవం కార్యక్రమం వైభవంగా నిర్వహించేందుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.
Attachments area