సచివాలయం వద్ద టీడీపీ హై డ్రామా

హైద్రాబాద్‌, ఆగస్టు27(జనంసాక్షి): సచివాలయంలో టీడీపీ హైడ్రామా అర్ధరాత్రి వరకూ కొనసాగింది. సమతా బ్లాక్‌లోని సీఎం కార్యాలయానికి రైతు సమస్యలపై విజ్ఞప్తి చేసేందుకు వెళ్లిన టీడీపీ నాయకుల వివరణను వింటూనే సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి వెళ్లి పోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు రైతుల సమస్యలపై విన్నవించేందుకు వెళ్లిన తమ పట్ల సీఎం నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బ్లాక్‌లోనే సీఎం చాంబర్‌ ఎదుట బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా, గ్యాస్‌ లేదు, కరెంటు లేదు, సమస్యలను ఎలా అధిగమించేదంటూ సీఎం టీడీపీ నాయకులను ప్రశ్నిస్తూ వెళ్లి పోయినట్లు సమాచారం. టీడీపీ నాయకులను అడ్డుకునేందుకు పోలీసులు ఆ బ్లాక్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. టీడీపీ నాయకులకు భోజనం తీసుకెళ్లడానికి కూడా అనుమతించడం లేదు. ఇలా టీడీపీ హైడ్రామా అర్ధరాత్రి వరకూ కొనసాగుతూనే ఉంది.