‘సడక్‌’పై ..సమరం

అడుగడుగునా నిర్బంధం.. అయినా జై తెలం’గానం’
పది జిల్లాల పోరుబిడ్డలు బెంగళూర్‌ హైవేపైకే…
ఉద్యమకారులను అడుగడుగునా
అరెస్టులు చేస్తూ దొంగల్లా చూస్తున్నరు : కోదండరామ్‌
హైదరాబాద్‌, మార్చి 20 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్రా సాధన కోసం పది జిల్లాల ప్రజలు కదిలారు. పోలీసులు ఎన్ని నిర్బంధాలు విధించిన, ఎందరిని అరెస్టు చేసినా చాపకిందనీరులా ఉద్యమకారులు ఒక్కరొక్కరుగా బెంగళూర్‌ హైవే సమీప గ్రామాలకు చేరుకొని గురువారం ఉదయాన్నే రోడ్డుపైకి చేరుకునేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇప్పటి వరకు ఉద్యమంలో వెనుకుండి పోరాడిన విద్యార్థులు ఇప్పుడు ముందువరసలో ఉండి బంద్‌ను జయప్రదం చేసేందుకు సమాయత్తమయ్యారు. పోలీసులు అడుగడుగునా నిర్బంధాలు పెట్టినా తెలంగాణవాదులు వాటిని లక్ష్యపెట్టలేదు. తెలంగాణవాదులను ఒక్కో జిల్లాలో వందల సంఖ్యలో అరెస్టు చేసినా వెరువలేదు. ఒక్కొక్కరుగా ఇప్పటికే తమ తమ గమ్యస్థానాలకు చేరుకొని అక్కడి నుంచి రణనినాదం చేసేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి హైదరాబాద్‌కు చేరుకొనే రోడ్లపై పోలీసులు ఇప్పటికే పికెట్లు ఏర్పాటు చేసి రాకపోకలు సాగించే ప్రయాణికులను క్షుణ్నంగా తనిఖీ చేస్తున్నారు. అనుమానితులను అరెస్టు చేసి ఠాణాలకు తరలిస్తున్నారు. ముందస్తుగానే తెలంగాణవాదులను అరెస్టు చేసి బైండోవర్లు చేశారు. అయినా పోరుబిడ్డలు వెరవలేదు. వెనుదీయలేదు. తమ లక్ష్యం సాధించేందుకు ఇది మంచి వేదిక అని తేల్చుకున్న విద్యార్థులు పరీక్షలను పక్కన బెట్టి, భవిష్యత్‌ను పణంగా పెట్టి శంషాద్‌బాద్‌ నుంచి ఆలంపూర్‌ వరకు వివిధ ప్రాంతాలకు ఇప్పటికే చేరుకున్నారు. బుధవారం రాత్రి మరికొంత మంది సాధారణ పౌరుల్లాగా ఆయా ప్రాంతాలకు బయలు దేరారు. ఉదయం జేఏసీ నిర్ణయించిన సమాయానికి తెలంగాణ పొలికేక పెట్టేందుకు సిద్ధమయ్యారు. బుధవారం అర్ధరాత్రి దాటాక తెలంగాణవాదులు, ఎమ్మెల్యేల అరెస్టులను పోలీసులు ముమ్మరం చేశారు. షాద్‌నగర్‌లో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను అరెస్టు చేశారు. ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, మెదక్‌, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ జిల్లాలకు చెందిన ప్రతినిధులను ముందస్తుగానే అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. కాకతీయ యూనివర్శిటీ విద్యార్థి విభాగం ప్రతినిధులను, విద్యార్థి జెఎసి ప్రతినిధులను సైతం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల చర్యలను జేఏసీ నేతలు, టిఆర్‌ఎస్‌ ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. అరెస్ట్‌లు, ఉరికొయ్యలు ఉద్యమాన్ని ఆపలేవని వారు హెచ్చరించారు. పోలీసులు తమ వైఖరిని మార్చుకోక పోతే రాబోయే కాలంలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఉద్యమకారులను రెచ్చగొడితే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాద్యత వహించాల్సి ఉంటుందని హరీశ్‌రావు, మల్లేపల్లి లక్ష్మయ్య హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమాన్ని చిన్నచూపు చూడడమేకాకుండా పోలీసులతో అణచివేయాలని సీఎం బావిస్తే అది ఆయన అవివేకమే అవుతుందన్నారు. బాధ్యతారహి తంగా వ్యవహరిస్తూ ఉద్యమకారులపై పోలీసులను ఉసిగొల్పుతున్న సీఎం తన వైఖరిని మార్చుకోవాలని వారు హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారులను అడుగుడుగునా అరెస్టులు చేస్తూ దొంగల్లా చూస్తున్నరని జేఏసీ చైర్మన్‌ ప్రొ

ఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. సర్కారు తీరు మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన సడక్‌బంద్‌ విజయవంతమై తీరుతుందని స్పష్టం చేశారు. బంద్‌ సందర్భంగా విద్యార్థులు, ప్రజలు సమంయమనం పాటించాలని సూచించారు. ప్రజాస్వామ్యయుతంగా బంద్‌ చేస్తామంటూ పోలీసులు అనుమతి నిరాకరించడం, ఎక్కడికక్కడా ఉద్యమకారులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు.