సబితాను కలిసిన తెలంగాణ ఐకాస నేతలు
హైదరాబాద్: తెలంగాణ ఐకాస నేతలు ఈరోజు మథ్యాహ్నం హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. తెలంగాణ మార్చ్‌ను వాయిదా వేసుకోవాలని ఐకాసకు హోంమంత్రి విజ్ఞప్తి చేశారు. సచివాలయంలో తనను కలిసిన ఐకాస ప్రతినిధులతో సబిత తెలంగాణ మార్చ్‌పై చర్చించారు. రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలు ఈ సదస్సు ద్వారా ప్రపంచానికి చాటే అవకాశం ఉందని ఆమె నేతలకు వివరించారు. శాంతియుతంగానే తాము సెప్టెంబరు 30వ తేదీన తెలంగాణ మార్చ్ నిర్వహిస్తామని, వాయిదా వేయమని ఐకాస నేతలు హోంమంత్రికి స్పష్టంచేశారు. తెలంగాణ మార్చ్ నిర్వహించేందుకు పోలీస్ శాఖ అనుమతిస్తే అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సును విజయవంతం చేసేందుకు తాము సమావేశమై ఓ నిర్ణయం తీసుకుంటామని వివరించారు.



