సమస్యల పరిష్కారం కోసం పోరాటం

నెల్లూరు, జూన్‌ 24  : ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించడం కోసం పోరాటమే ఏకైక మార్గమని ఆదివారంనాడు ఇక్కడ సమావేశమైన ఆంధ్ర ప్రగతి బ్యాంకు అధికారుల సర్వ సభ్య సమావేశం అభిప్రాయపడింది. ఈ సమావేశంలో ప్రసంగించిన ఆంధ్ర ప్రగతిబ్యాంకు ఉద్యోగుల సంఘం జాతీయ నాయకుడు వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో బ్యాంకులు కీలక పాత్రను పోషిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి మాత్రం సరైన సహకారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు వేతన సవరణ జరగక అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. మరోవైపు బ్యాంకులను ప్రైవేటీకరించడానికి కేంద్రం పెద్ద ఎత్తున కుట్రలు పన్నుతోందని, దీన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టే దిశగా అన్ని బ్యాంకుల యూనియన్లు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు బ్యాంకు సిబ్బంది నిజాయితీతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పది తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో ఆంధ్ర ప్రగతి బ్యాంకు జిఎం పి.ఆదినారాయణరెడ్డి, ఆంధ్ర ప్రగతి బ్యాంకు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.