సమాజంలో మీడియా.. జర్నలిస్టుల పాత్ర గొప్పది
ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్
ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ నూతన కమిటీ సభ్యులకు ఆత్మీయ సత్కారం
కరీంనగర్, సెప్టెంబర్ 11:- మీడియా లేకుంటే ప్రపంచ నలుమూలలలో జరిగే వార్త విశేషాలు బయట ప్రపంచానికి తెలియవని, అందుకే మీడియా.. జర్నలిస్టుల పాత్ర సమాజంలో గొప్పదని ఎంఐఎం నగర అధ్యక్షుడు, తెలంగాణ హజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ అన్నారు. ఆదివారం నగరంలోని గులాం
అహ్మద్ నివాసంలో టియుడబ్ల్యూజే అనుబంధమైన తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఇటీవలే కరీంనగర్ జిల్లా నూతన కమిటీ ఎన్నికైన సభ్యులకు ఆత్మీయ సన్మానం చేశారు. ఈసందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ సమాజంలో జరిగే ప్రతి అంశాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించేదే మీడియా అని, విలువలతో కూడిన వార్తలను ప్రసారం చేసినప్పుడే, మీడియా నైపుణ్యత, వాస్తవాలు ప్రపంచానికి చేరుతాయన్నారు. ఉర్దూ జర్నలిస్టుల నూతన జిల్లా కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ఉర్దూ జర్నలిస్టులు తమ వృత్తిలో రాణించాలని ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ తోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో, ఆర్టీసీ బస్టాండ్లలో పేర్ల సూచికల బోర్డులపై ఉర్దూ రాష్ట్రంలో రెండో అధికార భాష అయిన నేపథ్యంలో, ఉర్దూలో బోర్డులు ఏర్పాటు చేయాలని, ఉర్దూ జర్నలిస్టులు ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ కు విజ్ఞప్తి చేశారు. తమ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్, మేయర్ యాదగిరి సునీల్ రావుల సహకారంతో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పేర్ల సూచికల బోర్డు ఉర్దూలో ఉండేట్లు చొరవ తీసుకుంటామని గులాం అహ్మద్ హుస్సేన్ ఉర్దూ జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమి, కార్పొరేటర్లు బర్కత్ అలీ, అఖీల్ ఫిరోజ్, అజర్ దబీర్, నాయకులు సాజిద్ బాండ్, ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఎంఏ అసద్, సభ్యులు సిరాజ్ మసూద్, సాదత్ ఆలీ, సాధఖ్ అలీ, అజర్ ఫైసల్, షాకిర్, మోహసీన్ మోహియుద్దీన్, ఇమ్రాన్, అప్జల్, జహీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.