సరోగసి విధానంలో అక్రమాలకు తావులేకుండా చర్యలు
– అసెంబ్లీలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్, నవంబర్2(జనంసాక్షి): సరోగసి విధానంలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కె. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో రాష్ట్రంలో సరోగసి సెంటర్లు, సరోగసికి ప్రత్యేక చట్టం, అక్రమ సరోగసిపై చర్యలు వంటి తదితర అంశాలపై విపక్ష సభ్యులు చిన్నారెడ్డి, గీతారెడ్డి, పద్మావతి శాసనసభ ప్రశ్నోత్తరాల్లో భాగంగా అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. రాష్ట్రంలో 71 సంతాన సాఫల్య కేంద్రాలు, హైదరాబాద్‌లో 27 ఫర్టిలిటీ సెంటర్లు ఉన్నాయని తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో రంగారెడ్డి 15, మేడ్చల్ 15, వరంగల్ నాలుగు, కరీంనగర్ నాలుగు, మహబూబ్‌నగర్ రెండు, నిజామాబాద్ 2, అదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కటి చొప్పున సంతాన సాలఫ్య కేంద్రాలు ఉన్నాయన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సరోగసి నిర్వహించినందుకు బంజారాహిల్స్ సాయికిరణ్ ఆస్పత్రిపై క్రిమినల్ కేసు పెట్టినట్లు మంత్రి వెల్లడించారు. సరోగసి విధానంపై సూచనలు, సలహాల కోసం రిటైర్డ్ న్యాయమూర్తి గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ రూపొందిందన్నారు. అలాగే అనుమతి లేని సంతాన సాఫల్య కేంద్రాలు, ఫర్టిలిటీ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.



