సర్కారు తీరు నోటితో ఒకటి .. నొసటితో మరొకటి

అనుమతిచ్చి అరెస్టులు
మండిపడ్డ తెలంగాణవాదులు

సబితా జోక్యం చేసుకో : జేఏసీ

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 29 :తెలంగాణలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. తెలంగాణ వాదుల నిర్బంధం యథావిధిగా సాగుతోంది. తెలంగాణ మార్చ్‌కు అనుమతించిన సర్కారు.. ఉద్యమకారులపై పోలీసులను ఉసిగొల్పింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు దమనకాండకు దిగారు. పది జిల్లాల్లో అరెస్టుల పర్వానికి తెర లేపారు. ఇళ్లల్లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. పొలిటికల్‌ జేఏసీ అధికార ప్రతినిధి పిట్టల రవీందర్‌, చలమారెడ్డిలను హైదరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వరంగల్‌ జిల్లాలో తెలంగాణ ఉద్యోగల సంఘాల జేఏసీ నేత మర్రి యాదవరెడ్డిని అరెస్టు చేశారు. కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ పాపిరెడ్డిని అరెస్టు చేసేందుకు యత్నించారు. ఖమ్మం జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యతో పాటు న్యూడెమోక్రసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. మెదక్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వందలాది మంది తెలంగాన వాదులను అరెస్టు చేశారు. ఉద్యోగ సంఘాలతో పాటు టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోనూ పోలీసులు అతిగా వ్యవహరించారు. ఉద్యమ నేతలను అదుపులోకి తీసుకున్నారు. వందలాది మందిని నిర్బంధించారు.
పోలీసుల వ్యవహారంపై తెలంగాణ ప్రాంత నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనుమతిచ్చినా కూడా అరెస్టులు చేయడం బాధాకరమని టీ-కాంగ్రెస్‌ ఎంపీలు అన్నారు. ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు దిగొద్దని హెచ్చరించారు. ఆటంకాలు కల్పించకుండా మార్చ్‌ శాంతియుతంగా జరిగేందుకు సహకరించారని కోరారు. అక్రమ అరెస్టులపై ¬ం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వారు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. తెలంగాణలో అక్రమ అరెస్టులు నిలిపివేయాలని, చెక్‌పోస్టులు ఎత్తివేయాలని ¬ం మంత్రికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌కు వచ్చే తెలంగాణ వాదులకు పోలీసులు సహకరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై సబిత సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అక్రమ అరెస్టులను పరిశీలించి, చెక్‌పోస్టుల ఎత్తివేతకు హావిూ ఇచ్చారని టీ-ఎంపీలు తెలిపారు. తెలంగాణలో అరెస్టుల పరంపర కొనసాగితే ఆందోళనలు తప్పవు అని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చినా అరెస్టులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఖమ్మం జిల్లాలో అరెస్టు చేసిన వాఇరిని విడుదల చేయకపోవడం ప్రభుత్వ దమననీతికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. దీనికి ¬ం మంత్రి, ఇన్‌చార్జి డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు అరెస్టులపై బీజేపీ రాష్ట్ర కిషన్‌రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టులను తక్షణమే ఆపాలని ఆయన ¬ం మంత్రికి ఫిర్యాదు చేశారు. మెదక్‌ జిల్లాలో ఉద్యోగ సంఘాల నేతలు, బీజేపీ నాయకులను అరెస్టు చేశారని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. మార్చ్‌కు అనుమతిచ్చినా.. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు చేపట్టడం సబబు కాదన్నారు. అరెస్టులపై ప్రశ్నిస్తే… అరెస్టులు ఆపాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని మెదక్‌ ఎస్పీ చెప్పాడని సబితకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ¬ం మంత్రి తక్షణమే అరెస్టులను ఆపేయిస్తానని హావిూ ఇచ్చారు. మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చి, అరెస్టులు చేయించడం దుర్మార్గమని జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ధ్వజమెత్తారు. ప్రభుత్వం దమననీతితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మార్చ్‌కు అనుమతి ఇచ్చి, అది విజయవంతం కాకుండా చూడాలని యత్నిస్తోందన్నారు. అరెస్టులను ఆపి, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అక్రమ అరెస్టులపై మంత్రులు సబిత, జానారెడ్డిలతో మాట్లాడామని చెప్పారు. మరోవైపు, తెలంగాణ ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తే ప్రభుత్వానికి గట్టి బుద్ది చెబుతామని ఉద్యోగ సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. ఉద్యోగులను అరెస్టు చేయడం ఆపకపోతే.. మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. అరెస్టు చేసిన వారందరినీ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణవాదులను హైదరాబాద్‌కు తరలించే బాధ్యతను మంత్రులు తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు.