సర్వత్రా అభద్రత..భయానకం
నెల్లూరు, ఆగస్టు 1 : గత నెల రోజులుగా జిల్లా ప్రజలను కుదిపి పారేసిన జోడు భయానక సంఘటనలతో సర్వత్రా అభద్రతా భావం నెలకొని ఉంది. గత గురువారంనాడు అంటే 26వ తేదీన భద్రాచలం నుంచి చెన్నయ్ వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌లో గుర్తు తెలీని వ్యక్తి ముగ్గుర్ని కిరాతకంగా హత్యచేయగా.. అంతకుముందు 18వ తేదీన కావలి రూరల్ మండలంలోని గౌరవరం గ్రామం వద్ద ఓ వ్యక్తిని కారుతో పాటే సజీవ దహనం చేసిన సంఘటన గుర్తుండే ఉంటుంది. తాజాగా సోమవారంనాడు ఏకంగా రైలులో ప్రయాణిస్తున్న 28మందిని సజీవ దహనం చేశారు. మునుపెన్నడూ లేని విధంగా జరిగిన ఈ ఘోరకలితో ప్రజలు బయట తిరగాలంటే వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని 980 గ్రామాల నుంచి ప్రతిరోజు సుమారు 13 లక్షల మంది ప్రజలు వివిధ ప్రాంతాలకు బస్సుల్లో, రైళ్లల్లో ప్రయాణిస్తుంటారు. 26న జరిగిన సంఘటనతో బస్సు ప్రయాణికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సోమవారం జరిగిన రైలు దుర్ఘటనలో డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ ఉద్యోగులు అకారణంగా బలి కావడం అన్ని వర్గాల ప్రజలను భయోత్పాతానికి గురి చేసింది. రైలు దుర్ఘటన జరిగాక గత రెండు రోజులుగా రైల్వేస్టేషన్‌లో పరిస్థితులను గమనిస్తే గతంతో పోల్చుకుంటే రాత్రి రైలు ప్రయాణానికి ప్రజలు ఇష్టపడడం లేదన్న విషయం ద్యోతకమవుతోంది. చెన్నయ్-మద్రాస్, చార్మినార్, నారాయణాద్రి, సర్కార్, తిరుమల ఎక్స్‌ప్రెస్‌లలో హైదరాబాద్, విశాఖ, కాకినాడ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు తక్కువగానే రిజర్వేషన్లు చేయించుకున్నట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. రాత్రి వేళల్లో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సుమారు 150 బస్సులు ప్రయాణిస్తుంటాయి. ఈ నెల 26న, సోమవారం జరిగిన దుర్ఘటనల నేపథ్యంలో బస్సుల్లో కూడా రాత్రి వేళల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గినట్టు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. పగటి వేళ ప్రయాణిస్తే ప్రాణాలు దక్కించుకోవచ్చన్న అభిప్రాయంతో ఇలా ఎక్కువ మంది పగటి ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 18న జరిగిన కారు సజీవదహనం కేసు మిస్టరీని నేటికి చేధించక పోవడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. నిందితులను గుర్తించినప్పటికీ.. వారిని అరెస్టు చేసేందుకు కొంత సమయం పడుతుందన్న వాదనను జిల్లా ఎస్‌పి నిన్నటి విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. మహిళల మెడల్లోని చెయిన్లు తెంచుకున్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఒకపక్క శాంతిభద్రతలు.. మరోవైపు విచ్చలవిడిగా జరుగుతున్న దొంగతనాలతో ప్రజలు కకావికలమవుతున్నారు. పోలీసులు ఇంతకు పదిరెట్లు ఆందోళనకు గురవుతున్నారు. ఎక్కడ.. ఏ క్షణంలో.. ఏ రకమైన దుర్ఘటన చోటు చేసుకుందో అన్న భయంతో చివరకు జిల్లా ఎస్‌పి సైతం రాత్రి వేళల్లో పెట్రోలింగ్ నిర్వహించాల్సి వస్తుందంటే పరిస్థితి ఎంద భయంకరంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. నిఘా విభాగాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినప్పటికీ అగంతకులు ఏ రకంగా విజృంభిస్తారో కనిపెట్టలేని అనిశ్చితి ఏర్పడిందని పోలీసులే చెబుతున్నారు. సోమవారం జరిగిన రైలు దుర్ఘటనలో భిన్న కథనాలు విన్పిస్తుండగా వాటిని ఖండించలేక.. అటు సమర్ధించలేక పోలీసులకు, రైల్వే అధికారులకు తల ప్రాణం తోకకు వచ్చిందన్న చందాన మారింది. పేలుడు పదార్ధాలు ఎస్-11 కంపార్టుమెంటులో చేరవేస్తుండడం వల్లే ఈ దుర్ఘటన సంభవించిందని పోలీసు అధికారులే అనుమానిస్తున్నారు. నిన్నరాత్రి వరకు రైలుబోగీలోని నమూనాలను సేకరించిన ఫోరెన్సిక్ నిపుణులు హైదరాబాద్‌లో మాట్లాడుతూ పేలుడు పదార్ధాల పాత్ర లేదని వెల్లడించారు. 48 గంటల్లో దీనిపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పిన ఫోరెన్సిక్ నిపుణులు మంగళవారం సాయంత్రమే ఒక బులెటిన్ విడుదల చేయడం గమనార్హం. మొత్తం మీద జులై నెల నెల్లూరు ప్రజలకు విషాదాన్ని, భయాన్ని మిగిల్చింది.