సాదా సీదాగా రాష్ట్ర అవతరణ వేడుకలు

ఆదిలాబాద్‌, నవంబర్‌ 1 : ప్రభుత్వం చేపట్టిన రాష్ట్ర దినోత్సవ వేడుకలను తెలంగాణవాదులు  బహిష్కరించడంతో గురువారం స్థానిక పోలీస్‌ పేరేడ్‌  గ్రౌండ్‌లో అధికారులు మాత్రమే పాల్గొనడంతో సాదా సీదాగా జరిగాయి. ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టర్‌ అశోక్‌ జాతీయ పతాకాన్ని  ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సుజాతశర్మ, జిల్లా ఎస్పీ త్రిపాఠితోపాటు కొంత మంది అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన పథకాలు ప్రజలకు అందించడంలో శాయ శక్తుల కృషి చేస్తున్నామని అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ నీటి సరఫరాకు, పారిశుద్ధ్యనికి అధిక ప్రాధ్యానత ఇవ్వడంతో పాటు ప్రజలకు ఉపాధి హామీ పథకం కింద పని దినాలను కల్పించామని అన్నారు. జిల్లా వ్యాప్తంగా నీటి సరఫరాకు, పారిశుద్ద్యం కోసం ప్రపంచ బ్యాంక్‌ నుండి సుమారు 96 కోట్ల రూపాయలు విడుదలకానున్నాయన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద 4,96వేల మందికి 2.25 లక్షల పనిదినాలు కల్పించేందుకు గాను, 18,4కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామన్నారు. ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించి, రోజుకు 116 రూపాయల కూలీని అందజేస్తున్నామన్నారు. జిల్లాలో వ్యవసాయం, పశుసంవర్ధ శాఖలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి జిల్లాను అభివృద్ధి పధంలో నడిపిస్తామన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖ ఆధ్వర్యంలో స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.