సింగిరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం

ఖమ్మం, జూన్‌ 27 : సింగరేణి కార్మికులంతా ఈ నెల 28న జరిగే గుర్తింపు ఎన్నికల్లో కార్మికులు ప్రశాంతంగా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల ప్రత్యేక అధికారి శ్రీవాత్సవ బుధవారం తెలిపారు. సింగరేణివ్యాప్తంగా 95 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్‌ బూత్‌ల వద్ద 144వ సెక్షన్‌ను అమల్లో ఉంచారు. ఒకొక్క పోలింగ్‌్‌ కేంద్రంలో 5 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు నిషేధిస్తూ నాలుగు జిల్లాలకు చెందిన కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు కార్మికులు గుర్తింపు కార్డులను తమ వెంకట తెచ్చుకోవాలని అన్నారు. గుర్తింపు కార్డులు లేని వారు సంబంధిత గనుల, డిపార్ట్‌మెంట్‌ల అధికారుల నుండి తాత్కాలిక గుర్తింపు కార్డులు పొందాలన్నారు. గురువారం సాయంత్రం 7 గంటల నుండి రాత్రి పొద్దు పోయే వరకు ఓటింగ్‌ లెక్కింపు జరిగే అకవకాశాలు ఉన్నాయని శ్రీవాత్సవ తెలిపారు.