సీమాంధ్ర వలసపాలకుల్లారా క్విట్‌ తెలంగాణ

-తెలంగాణ ప్రజా ఫ్రంట్‌
హైద్రాబాద్‌: సీమాంధ్ర వలస పాలకుల్లారా..క్విట్‌ తెలంగాణ అంటూ తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ కన్వీనర్‌ వేదకుమార్‌ తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం నగరంలోని ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఈ మేరకు ఆయన క్విట్‌ ఆయన అడ్వకేట్స్‌ జేఏసీ, తెలంగాణ రచయితల వేదిక సభ్యులతో కలిసి క్విట్‌ తెలంగాణ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు వ్యతిరేకంగా లాబీయింగ్‌లు చేస్తున్న సీమాంధ్ర పాలకులు, పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాడేందుకే ఈ క్విట్‌ తెలంగాణ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. దీనిలో భాగంగా ఆగస్ట్‌ 1 నుండి 8వ తేదీ వరకు తెలంగాణలోని పది జిల్లాల్లో ధర్నాలు, ర్యాలీలు చేపట్టనున్నామనీ, అలాగే 9న జిల్లా కేంద్రాల్లో చేపట్టే ధర్నాలల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన తెలంగాణ ప్రజలను కోరారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ వనరులను కాపాడుకోవడానికి తెలంగాణ ప్రజలందరూ కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ కొరకు యువత ఆత్మహత్యలు చేసుకోవడం భాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్‌ జేఏసీ నాయకులు, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ రత్నమాల, చిక్కడ శంకర్‌, తదితరులు పాల్గొన్నారు.