సెమీ ఫైనల్లోకి టింటూ లుకా

లండన్‌, ఆగస్టు 8 : భారత్‌కు చెందిన టింటూ లుకా లండన్‌ ఒలింపిక్స్‌ 800 మీటర్ల పరుగు పందెంలో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. కేరళకు చెందిన ఈ 23ఏళ్ళ పరుగుల రాణి ఒలింపిక్స్‌ మైదనాంలో జరిగిన హీట్‌ 2 విబాగంలో మూడో స్థానంలో నిలిచింది. దాంతో రేపు గురువారం జరిగే సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది.
హీట్‌2లో మొత్తం ఏడుగురు రన్నర్లు ఉన్నారు. ప్రస్తుతం కన్నా ఎక్కువ ప్రతిభ కనబరిస్తేనే ఆమె ఫైనల్లో ఫలితం సాధించగలుగుతుంది. ఫైనల్‌ శనివారం జరగుతుంది. హీట్‌ 2లో రష్యాకు చెందిన మేరియా సావివోవా మొదటి స్థానంలో రాగా, అమెరికాకు చెందిన అలైస్‌ ష్మిడ్త్‌ రెండో స్థానంలో నిలిచింది.
మొత్తం ఆరుహీట్స్‌ ఉన్నాయి. అన్ని హీట్స్‌ జరిగిన తర్వాత సెమీ ఫైనల్‌కు చేరే మొత్తం క్రీడకారులు ఎవరనేది తేలుతుంది. ప్రతి హీట్‌లో మొదటి మూడు స్థానాలు లభించిన వారు ఆటోమేటిక్‌గా సెమీ ఫైనల్‌కు చేరుకుంటారు. మొత్తం 24 మంది రన్నర్స్‌ సెమీ ఫైనల్‌లో ఉంటారు.
పిటి ఉషకు చెందిన ఉష స్కూల్లో లుకా భాగస్వామి. ఆమె 800 మీటర్ల పరుగు పందెంలో జాతీయ రికార్డును స్థాపించింది. 2010 ఆసియా క్రీడల్లో జరిగిన కాంటినెంటల్‌ కప్‌ పోటీల్లో ఆమె 15ఏళ్ల క్రితం షైనీ విల్సన్‌ నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది. అయితే, కామన్‌వెల్త్‌ క్రాడల్లో ఆమె నిరాశపరిచింది.