హైదరాబాద్‌ నుంచి షిరిడివెళుతున్న బస్సు లోయలో పడి

32 మంది మృతి..16 మందికి తీవ్ర గాయాలు
మృతదేహాలను ఉస్మానియాకు తరలింపు
హుటాహుటిన ఘటనాస్థలానికి శ్రీధర్‌బాబు..
సీఎం దిగ్బ్రాంతి

హౖదరాబాద్‌, జూన్‌ 16 (జనంసాక్షి):
మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి షిర్డీ వెళుతున్న కాళేశ్వర్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 30 మంది మృతిచెందగా, 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. క్షత గాత్రులను చికిత్స నిమిత్తం షోలాపూర్‌లోని అశ్విని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నుంచి షిర్డీకి వెళుతుండగా ఈ తెల్లవారుజామున మూడు గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఎదురుగా మరో బస్సు రావడంతో అదుపు తప్పి శ్రీకాళేశ్వరి ట్రావెల్స్‌కు చెందిన కెవి01డి 245 నంబర్‌ గల బస్సు నల్‌దుర్గ్‌ బ్రిడ్జిపై నుంచి లోయలో పడటంతో బస్సులోని ప్రయాణికులు నిద్రలోనే ప్రాణాలు విడిచారు. 30 మందికిపైగా ప్రయాణికులు ఘటనా స్థలంలోనే మరణించినట్టు సమాచారం. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో టీసీఎస్‌కు చెందిన 14 మంది ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది. వీరంతా విజయనగరం, విశాఖపట్నానికి చెందిన వారిగా సమాచారం. షోలాపూర్‌ జెల్‌కోటా పిహెచ్‌సీలో మృతదేహాలను ఉంచారు. అక్కడే పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం నగరంలోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సాయంత్రానికి మృతదేహాలను హైదరాబాద్‌కు తరలిస్తారు. మృతుల ఫొటోలను ఐఅండ్‌ పీఆర్‌ ఆఫీసులో ఉంచారు. మృతి చెందిన వారిలో ఇప్పటి వరకు ఆరుగురిని గుర్తించినట్టు సమాచారం. ప్రమాదానికి గురైన బస్సు కర్ణాటక రాష్ట్రానికి చెందినదిగా అధికారులు తెలిపారు.
క్షతగాత్రుల వివరాలు..
ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ప్రమాదంలో గాయపడిన వివరాలు ఇలా ఉన్నాయి. కె. కృష్ణతులసి, కె. వెంకటేశ్వరరావు(హైదరాబాద్‌), పాల్‌ జోసఫ్‌(కృష్ణా), దీపిక, రాధిక(బాజుపల్లి), కిరణ్‌ ఉపేంద్ర (నాగర్‌ కాలపురం), జి. యాదగిరి (హైదరాబాద్‌), బి. సంపత్‌ చంద్రావతి (విశాఖపట్నం), వి. కిరణ్‌కుమార్‌ (శ్రీకాకుళం), డాక్టర్‌ జ్యోతి సుశీల్‌ (హైదరాబాద్‌) ఉన్నారు.
బస్సులో 14 మంది టీసీఎస్‌ ఉద్యోగులు..
శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో షిర్డీ వెళ్లాలని బయలు దేరారు పలువురు సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగులు. ప్రమాదానికి గురైన బస్సులో 14 మంది టీసీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థకు చెందిన ఉద్యోగులే ఉన్నట్టు సమాచారం. ఈ సంస్థకు చెందిన సావర్ణిక, దివ్య, కృష్ణసాయి, సంపత్‌, ఉమ, సాహిత్య, పూజిత, మహిమ, ఉషాకీర్తి, సుచిత్ర, వాణిమానస, శేఖర్‌, ప్రవీణ్‌ బస్సులో ఉన్నారు. కూకట్‌పల్లి నుంచి టికెట్‌ బుక్‌ చేసుకున్న నిజాంపేటకు చెందిన దీపిక, జయవర్దన్‌, వెంకటేశ్వర్లు, ఆజమ్మ, కృష్ణయ్య, సావిత్రి, రాధిక ప్రమాదానికి లోనైన బస్సులో ఉన్నట్టు సమాచారం.
ప్రమాదంలో టీసీఎస్‌ ఉద్యోగులున్నారన్న సమాచారం తెలుసుకున్న మంత్రి పొన్నాల లక్ష్మయ్య వారి వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రమాదంలో చిక్కుకున్న తమ కంపెనీ ఉద్యోగుల పూర్తి వివరాలు ఇంకా తెలియలేదని, అయితే నలుగురు మాత్రం క్షేమంగా ఉన్నారని టీఎస్‌ఎస్‌ కంపెనీ రీజినల్‌ హెడ్‌ రాజన్న తెలిపారు.
సీఎం దిగ్భ్రాంతి..
షిర్డీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం తెలిసిన వెంటనే ఆయన రవాణా, రెవెన్యూ, వైద్య శాఖాధికారలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు అవసరమైన సహాయం, చికిత్స అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదం సమాచారాన్ని ఉస్నాబాద్‌ కలెక్టర్‌ తెలియజేశారు. బాధిత కుటుంబ సభ్యులు షోలాపూర్‌ చేరుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గురైన బస్సులో హైదరాబాద్‌లోని వేరువేరు ప్రాంతాల నుంచి పలువురు టికెట్లను బుక్‌ చేసుకున్నారు. కొందరు ఆన్‌లైన్‌లోనూ, మరికొందరు ఏజెంట్ల ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్నారు. కూకట్‌పల్లి, మియాపూర్‌ తదితర ప్రాంతాల నుంచి టెకెట్లు బుక్‌ అయినట్లు తెలిసింది. తక్షణమే మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్‌ ద్వివేదిని ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందించడం కోసం ప్రభుత్వం తరుఫున అవసరమైన సహాయక చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఆదేశించారు.
వివరాల కోసం హెల్ప్‌లైన్‌ నంబర్లు..
షిర్డీ బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హుటాహుటిన డీఎస్పీ, ఆర్డీఓ, వైద్యాధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని సంఘటన స్థలానికి పంపారు. ప్రమాదంలో మృతి చెందిన వారి బంధువులకు సమాచారం అందించేలా రెండు హెల్ప్‌లైన్‌ నంబర్లు ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ప్రమాయణికుల వివరాల కోసం 02472-222700, 02472-222900 నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. క్షత గాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించేందకు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
కుటుంబ సభ్యుల ఆందోళన..
హైదరాబాద్‌ నుంచి షిర్డీ వెళ్లిన బస్సు లోయలో పడిన వార్త తెలిసి ప్రయాణికుల కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. 50 మంది ప్రయాణికులతో కాళేశ్వరి ట్రావెల్స్‌కి చెందిన వోల్వో బస్సు నిన్న ఇక్కడి నుంచి బయల్దేరి వెళ్లింది. బస్సు ప్రమాదానికి గురయ్యిందన్న వార్త తెలిసి ట్రావెల్స్‌ కార్యాలయం వద్దకు తమ వారి క్షేమ సమాచారాల గురించి ఆరా తీస్తున్నారు. అయితే ట్రావెల్స్‌ వారి దగ్గర సరైన సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళనకు గురయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మరో వైపు బాధిత బంధువులు లక్డీకాపూల్‌ ట్రావెల్‌ ఆఫీస్‌కు చేరుకుని తమ వారి వివరాలను తెలుసుకుంటున్నారు. దీంతో ఆఫీసు మొత్తం బంధువుల రోదనలతో నిండిపోయింది. అటు కేపీహెచ్‌బీలోని కాళేశ్వర్‌ ట్రావెల్‌ ఆఫీసు ఇంకా తెరవకపోవడంతో ఆఫీసు వద్ద బంధువులు పడిగాపులు కాస్తున్నారు. సమాచారం తెలియక అయోమయ పరిస్థితిలో ఉన్నారు.