హైదారాబాద్ ఇక నుంచి నో బెగ్గర్స్ : జీహెచ్ఎంసీ

India Eid al Fitrహైదారాబాద్ :
హైదరాబాద్‌లో మొత్తం 14వేల మంది యాచకులు ఉన్నట్లు ఓ స్వచ్చంధ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. అయితే ఇందులో 98శాతం మంది నకిలీ బిచ్చగాళ్లేనట. ఇక వాళ్ల ఏడాది టర్నోవర్ ఎంతో తెలిస్తే కళ్లు తిరగాల్సిందే. బిచ్చగాళ్ల ఆదాయం ఏడాదికి రూ.24 కోట్లపైమాటే. వీళ్లు అడ్డుక్కోవడంతో పాటు డ్రగ్స్, వ్యభిచారం, మనీలెండింగ్ ద్వారా కూడా సంపాదిస్తున్నారట. ఇక కొంతమంది యాచకుల రోజువారీ ఆదాయం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.
జూబ్లీహిల్స్, పంజాగుట్ట, బంజారాహిల్స్, అబిడ్స్, హిమాయత్‌నగర్, సికింద్రాబాద్ ప్రాంతాలలో ప్రతీ రోజు రూ.1000 నుంచి రూ.2000 వరకు ఉంటుందని సర్వే చేసిన బెగ్గర్ ఫ్రీ ప్రతినిధులు చెబుతున్నారు. యాచకులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారికి సదుపాయాలు సమకూర్చడం, పనిచేయగలిగిన వారికి అవకాశాలు కల్పించడం, వ్యాధి పీడితలు ఉంటే చికిత్స చేయించడం వంటి కార్యక్రమాలతో ఆ వృత్తి నుంచి విముక్తి కల్పించాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది.
ఇన్ని చేసినా అలవాటు మానలేని వారిని యాచక వృత్తి నుంచి తప్పించేందుకు ఎవరూ వారికి ధర్మం చేయకుండా ప్రజల్లోనూ అవగాహన కల్పించాలని భావిస్తోంది. బ్యానర్లు, హోర్డింగ్‌ల ద్వారా భిక్షాటనను ప్రోత్సహించవద్దు అంటూ ప్రచారం చేస్తున్నట్టు బెగ్గర్ ఫ్రీ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. జంట నగరాలలోని నిజమైన యాచకులను గుర్తించి వారికి ప్రభుత్వం పునరావాసం కల్పించనుంది.
అలాగే పలు స్వచ్చంధ సంస్థలు కూడా దీనికి చేయూత అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 23న జీహెచ్ఎంసీ బెగ్గర్ ఫ్రీ సొసైటీ కలిసి సంయుక్తంగా సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు పోలీసు శాఖ అధికారులు, పలు స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు.