అంగన్వాడీ కేంద్రాలను పకడ్బందీగా నిర్వహించాలి
శ్రీకాకుళం, జూన్ 16 (జనంసాక్షి) : అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, సమయపాలన, పౌష్టికాహార పంపిణీ విదార్థులు నమోదు తదితర అంశాల్లో తేడాలు వస్తే కఠిన చర్యలు తప్పవని ఐసిడిఎస్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. అంగన్వాడీ కార్యకర్తలపై ఫిర్యాదులు వస్తే దర్యాప్తులో వాస్తవమని రుజువైతే కార్యకర్తలను తొలగించేందుకు కూడా వెనుకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు. రాజాంలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో శనివారం నాడు ఆయన విలేకరులతో మాట్లాడారు. కొన్ని కేంద్రాలపై ఫిర్యాదులు అందయాని వెల్లడించారు. తాను ఎప్పటికప్పుడు కేంద్రా లను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని తనిఖీల్లో తప్పులు వెల్లడైతే తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 3,397 ప్రధాన, 689 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు సంబంధించి వచ్చే ఏడాది మార్చి వరకు 13 కోట్ల రూపాయల బడ్జెట్ విడుదలైందన్నారు. గతంలో ప్రభుత్వం పెంచిన జీతాలకు సంబంధించి బకాయిలు విడుదల కాలేదన్నారు. జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలందరికీ సీమ్కార్డులు మంజూరు చేశామన్నారు. ఐదు మండలాల్లో పంపిణీ కొనసాగుతుందన్నారు. ఈ నెలకు సంబంధించి పౌష్టికాహారం అన్ని కేంద్రాలకు పంపించామన్నారు. అంగన్వాడీ పర్యవేక్షకులు సిబ్బందికి జీతాలు 1.10 కోట్ల రూపాయలు విడుదలయ్యాయని ఆయన తెలిపారు.