అంతర్జాతీయ ప్రమాణాలతో రహదారులు
రూ. 3,400 కోట్లతో అభివృద్ధి
రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ ఎం.డి.రాజగోపాలరెడ్డి
శ్రీకాకుళం, జూలై 20 : రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలోని పలు రహదార్లను అభివృద్ధి చేసి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు అభివృద్ధి సంస్థ ఎం.డి.కె.రాజగోపాలరెడ్డి అన్నారు. నరసన్నపేట నియోజకవర్గంలోని పలు రహదార్లను పరిశీలించేందుకు విచ్చేసిన సందర్భంగా ఆయన అనంతరం స్థానికంగా ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో 12,240 కిలోమీటర్ల పొడవునా రహదార్లను అభివృద్ధి పరుస్తున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచబ్యాంకు తరహాలో రూ. 3,400 కోట్లతో 2015నాటికి పూర్తి చేస్తామన్నారు. ముఖ్యంగా ప్రమాదాలను నివారించేందుకు వీలుగా రహదార్లను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో రహదార్ల వద్ద రక్షణ మార్గాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పర్లాకిమిడి-కళింగపట్నం, బత్తిలి, పాలకొండ, రాజాం, విజయనగరం, పాలకొండ రహదార్లను ఈ నిధులతో విస్తరిస్తున్నట్లు చెప్పారు. ఆయనతో పాటు ధర్మాన రామదాస్, చింతు రామారావు, ఎస్.ఇ. సిహెచ్‌వి సోమశేఖర్, ఇ.ఇ. గోపీనాథ్ సాహు, డి.ఇ.ఇ. రామినాయుడు, ఎ.ఇ.లు ఫణీశ్వర్, జె.ఎం.జె.రాజు తదితరులు పాల్గొన్నారు.