అకాల వర్షంతో .. తెలంగాణలో అపారనష్టం

ఐదుగురి మృతి     భారీగా పంటనష్టం కడగళ్లు మిగిల్చిన వడగళ్లు
హైదరాబాద్‌, ఫిబ్రవరి 16 (జనంసాక్షి):
రాష్ట్రంలో శనివారంనాడు పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపునీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అనంతపురం, చిత్తూరు, ఆదిలాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం,  కృష్ణా జిల్లాలో వర్షాలు పడ్డాయి. ఆకాల వర్షాల కారణంగా పత్తి, మొక్కజొన్న, వేరుశెనగ, బొప్పాయి పంటలు దెబ్బతినడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పలు జిల్లాలో నేడు కురిసిన వర్షాల వల్ల వేరు సంఘటనల్లో ఐదుగురు మృతి చెందారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. హనుమాన్‌పేట, ముత్యంరెడ్డి కుంటలో వర్షపు నీరు ఇళ్ళలోకి చేరాయి. కరీంనగర్‌ జిల్లాలో భారీగా వర్షాలుకురిశాయియి. సిరిసిల్ల, హుజూరాబాద్‌, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, పెద్దపల్లిలో భారగా వర్షాలు కురిశాయి. దీంతో వరి, మొక్కజొన్న, బొప్పాయి పంటలకు భారీ నష్టం వాటిల్లింది. హుజూరాబాద్‌ మండలం చినపాపయ్యపల్లిలో ఈదురుగాలులకు కరెంట్‌ తీగలు తెగిపడి ఓ రైతు మృతి చెందాడు.  మహబూబ్‌నగర్‌ జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి.

మాడ్గుల మండలం ఇర్వేన్‌లో వర్షపు నీరు ఇళ్ళలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వనపర్తి మార్కెట్‌ యార్డులో వర్షపు నీటికి 70బస్తాల వేరుశెనగ కొట్టుకపోవడంతో రైతులు ఆవేదన చెందారు. వరంగల్‌ జిల్లాలో కురిసిన వర్షాలకు మిర్చి పంట దెబ్బతిన్నది. రేగొండ మండలం దామరంచపల్లిలో విద్యుత్‌ తీగలు పడి గొర్రెల కాపరి మృతి చెందాడు. జనగామ మార్కెట్‌ యార్డులో వర్షాలకు వేరుశెనక బస్తాలు తడిశాయి. నిజామాబాద్‌ జిల్లా బిస్కంద సమీపంలో రహదారిపై భారీ వృక్షం కూలడంతో ట్రాఫిక్‌ స్తంభించి, వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్‌ జిల్లా శ్రీరాంపూర్‌ గనిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. కాగజ్‌నగర్‌లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయియి. ఆందెల్లిలో రేకుల షెడ్డు కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.  కృష్ణా జిల్లాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. జగ్గయ్యపేట, నందిగామ, కంచకచర్ల, తిరువూరులో కురిసిన వర్షాలకు మొక్కజొన్న, పత్తిపంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముత్యాల కోటిలింగ హరిహర క్షేత్రంలోని గణపతి ఆలయంపై పిడుగు పడటంతో గుడిపాక్షికంగా దెబ్బతిన్నది. ఖమ్మం జిల్లాలో భారీగా వర్షాలు పడ్డాయి. 11మండలాల్లో కురిసిన వర్షాలకు జనం అతలాకుతలం అవుతున్నారు. భారీ పంటలకు నష్టం వాటిల్లింది. అధికారులు నష్టం అంచానాలకు సిద్దమవుతున్నారు.